Jul 19,2023 21:19

నిరసన తెలుపుతున్న సుబ్బయ్య దంపతులు

రాజంపేట అర్బన్‌ : కాసులు ఇచ్చిన వారికి న్యాయం చేసేందుకు అమాయకులైన ఓ రైతును అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌ శాఖలు అధికార దుర్విని యో గానికి పాల్పడుతున్న దౌర్జన్యకాండ మండల పరిధిలోని హెచ్‌.చెర్లోపల్లి హస్తవరంలో చోటు చేసుకుంది. నిరక్షరాస్యుడైన ఆ పేద రైతు అధి కార బలానికి నిలువలేక మరణమే శరణ్యం అంటూ భార్యతో కలిసి బుధవారం పురుగుల మందు తాగేందుకు సిద్దపడ్డాడు. వివరాల్లోకి వెళితే... చెర్లోపల్లికు చెందిన బసిన బోయిన సుబ్బయ్య, యానాదమ్మ దంపతులు తమ గ్రామంలోనే 357, 358, 359 సర్వే నెంబర్లలో 25 ఏళ్లుగా ఐదు ఎకరాల పట్టా భూమిని సాగు చేసుకుంటున్నారు. వీరి భూమి వెనుకనే అదే గ్రామానికి చెందిన బసిన బోయిన వెంకటయ్యకు చెందిన భూమి ఉంది. తన పొలానికి దారి కోసం సుబ్బయ్య కుటుంబంపై అధికారుల అండతో ఒత్తిడి తీసుకురావడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో రాజంపేట రూరల్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు సుబ్బయ్యను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌లో ఉంచి సాయంత్రం ఇంటికి పంపించారని, తిరిగి ఇంటికి వచ్చే సమయానికి తన పొలం నుంచి వెంకటయ్య పొలానికి దారి నిర్మించారని, ఇదంతా రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు అధికారుల అండతో వెంకటయ్య చేశాడని బాధితుడు సుబ్బ య్య ఆరోపిస్తున్నాడు. విద్యుత్‌ శాఖ అధికారులు గతంలో తన పేరిట పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ నిర్మించి రాజకీయ ఒత్తిడితో నేటి వరకు విద్యుత్‌ సరఫరా ఇవ్వలేదని ఆరోపించారు. విద్యుత్‌ సర ఫరా కావాలంటే వెంకటయ్య పొలానికి దారి ఇవ్వాలని విద్యుత్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నా రన్నారు. భూ వివాదం కోర్టులో ఉందని, కోర్టు ఉత్తర్వులు కూడా లెక్కచేయకుండా అధికారుల అండదండలతో వెంకటయ్య అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమపై దౌర్జన్యానికి పాల్పడిన వీడియోలను, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు సైతం ధ్వంసం చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ సుబ్బయ్య దంపతులు తమ పొలంలో పురుగుల మందు డబ్బా తీసుకొని బోరుమని విలపించారు. ఇదే విషయమై సుబ్బయ్య దంపతులు బుధవారం డిఎస్‌పి విఎన్‌కె చైతన్యకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి డిఎస్‌పి చైతన్య పోలీస్‌, రెవెన్యూ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపి సిసి కెమెరాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కేసును క్షుణ్ణంగా విచారించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.