ప్రజాశక్తి-పిఠాపురం గోకివాడలోని అక్కినీడి వారి చెరువు పుట్టకుంట కాలువపై అధికారులు తొలగించిన షట్టర్లు తిరిగి ఏర్పాటు చేసే వరకూ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. రైతులు చేస్తున్న నిరాహార దీక్ష శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ దీక్షల్లో గ్రామ రైతులు ఎన్.కాశి, ఎన్.నానాజీ, ఎన్.బ్రహ్మానందం, ఎం.వీర్రాజు, ఎన్.బాబులు ఉన్నారు. సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో రైతులు గ్రామ సచివాలయం ముట్టడానికి పిలుపునిచ్చారు. పోలీసులు అక్కడకు భారీగా చేరుకోవడంతో రైతులు సచివాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గేట్లు తొలగించే ముందు కనీసం గ్రామంలో ఏ అధికారీ పర్యటన చేయలేదని, రైతులతో సమావేశం కూడా నిర్వహించలేదని ఏకపక్ష ధోరణితో గేట్లు తొలగించారన్నారు. ఆందోళన చేస్తున్న, రిలే నిరాహారదీక్ష చేస్తున్న, వినతిపత్రాలు ఇచ్చిన నేటికి అధికారులు సమస్యను పరిష్కరించలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. షట్టర్లు తొలగించిన స్థానంలో గ్రామంలో రైతులకు ఎవరికీ తెలియకుండా చెక్క బల్లలు వేసి వెళ్ళిపోయారని తొలగించిన షట్టర్ల స్థానంలో తిరిగి యథావిధిగా షట్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె.హరినాథ్‌బాబు, ఉప సర్పంచి నామా సురేష్, మాజీ సర్పంచ్ నామా వెంకట్రావు, మాజీ సర్పంచ్ గరగ సత్యానందం, నామా పెద్దిరాజు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.










