Feb 25,2023 23:53

రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ చిన్నికృష్ణ

ప్రజాశక్తి- మునగపాక రూరల్‌
అనకాపల్లి- అచ్చుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న తోటాడ రెవెన్యూ పరిధిలోని నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమావేశం మండలంలోని గంగా దేవిపేటలోని పైడిమాంబ ఆలయంలో శనివారం జరిగింది. తోటాడ రెవెన్యూ పరిధిలో 110 మంది నిర్వాసితులు ఉండగా అరకొర సమాచారంతో 50, 60 మందితో ఏర్పాటు చేసిన ఈ సమావేశం అర్ధాంతంగా ముగిసింది. మూడు సమావేశాల్లోనూ అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ న్యాయబద్ధమైన పరిహారం ప్రకటించకపోవడంతో సమావేశాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆర్డిఓ నిర్వాసితులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయ భూములకు గజానికి రూ.8,500, వ్యవసాయేతర భూములకు గజానికి రూ.12,000 చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో నిర్వాసితులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోవడంతో పరిహారం మీరే నిర్ణయించుకుని సమావేశానికి హాజరుకావాలని రైతులను ఆర్డీవో కోరారు. వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు సరి సమానంగా రూ.15,000 చొప్పున పరిహారం ప్రకటిస్తేనే భూములు ఇస్తామని, లేకుంటే ఇచ్చేది లేదని నిర్వాసితులు తెగేసి చెప్పారు. అయితే నిర్వాసితులు కోరిన పరిహారాన్ని ఆర్డీవో తోసిపుచ్చారు. వ్యవసాయేతర భూములకు రూ.12,000, వ్యవసాయ భూములకు 8,500 చెల్లిస్తామని, అంతకంటే ఇచ్చేది లేదని, దీనికి ఆమోదం లేకపోతే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆర్‌డిఒ స్పష్టం చేశారు. మునగపాక, నాగులాపల్లి, తిమ్మరాజుపేట గ్రామాలకు బేసిక్‌ వ్యాల్యూ ప్రకారంగా పరిహారం ప్రకటించారని, అదే బేసిక్‌ వ్యాల్యూ ఇక్కడ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిర్వాసితుల సంఘం నాయకులు బొద్దపు శ్రీరామ్మూర్తి, కన్వీనర్‌ ఎస్‌.బ్రహ్మాజీ ఆర్డిఓ చిన్ని కృష్ణతో వాగ్వాదానికి దిగారు. మెజారిటీ నిర్వాసితుల ఆమోదం లేకుండా కోర్టుకు ఏ విధంగా వెళతారని ప్రశ్నించారు. మరోసారి పరిహారం విషయంపై పునరాలోచించి న్యాయబద్ధమైన ప్యాకేజీని ప్రకటించాలని ఆర్డీవోను కోరారు.