Mar 05,2023 00:34

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, వేదికపై శర్మ తదిరులు

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ స్వతంత్రత ఆయువుపట్టు అని, దాన్ని కాపాడుకోవాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 'భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత -సవాళ్లు' అనే అంశంపై ఐలు రాష్ట్ర కమిటీ, విశాఖపట్నం జిల్లా కమిటీల ఆధ్వర్యాన శనివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన్‌ కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడటంలో ప్రజాసంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు తమవంత్రు పాత్ర పోషించాలన్నారు. సమావేశానికి విశిష్ట అతిథిగా విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పైలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవివిఎస్‌.శర్మ, ఐలు విశాఖ కమిటీ అధ్యక్షులు బివి.రామాంజనేయరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.ఆనందరెడ్డి, నూకల వెంకటేశ్వరరావు, భగత్‌ తులసీదాస్‌, ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కోరెడ్ల రమాప్రభ తదితరులు ప్రసంగించారు. ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఉప రాష్ట్రపతి కొలీజియం ఉద్దేశించి అనేక అంశాలపై ప్రతిపాదించడం తీవ్ర గర్హనీయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కొలీజియం కాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతిని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతినిధులు ముక్తకంఠంతో ఉద్ఘటించారు. ఉద్యోగ విరమణ పొందిన న్యాయమూర్తులకు పదవులు ఇవ్వడం వంటివి కూడా స్వతంత్రతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ విశాఖపట్నం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.