ప్రజాశక్తి- సబ్బవరం
న్యాయపరమైన క్రియాశీలతను ఒక వరం లేదా శాపంగా చూడకూడదని, దానిని ఒక అవసరంగా చూడాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్‌ఎస్.సోమయాజులు అన్నారు. 'న్యాయ క్రియాశీలత - వరమా లేదా శాపమా' అన్న అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో శనివారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమయాజులు మాట్లాడుతూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని పేదవాడికి న్యాయం చేయడానికి సహాయం చేసిన ముఖ్యమైన తీర్పులను చర్చిస్తూ జ్యుడిషియల్ యాక్టివిజం ప్రస్తుత భారతీయ సమాజంలో అవసరమని చెప్పారు. సాధారణ వ్యక్తికి న్యాయం చేసేందుకు న్యాయపరమైన క్రియాశీలతను ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై ముఖ్యమైన మైలురాయి తీర్పులను ఆయన ఉదహరించారు. మానవీయ కోణం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లే అనేక కేసులలో లక్షలాది మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. ఒక చట్టాన్ని ఎంత మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో నొక్కి చెప్పేందుకు జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతి ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఇ.వెంకటేశం కుటుంబ సభ్యులు, అకడమిక్ డైరెక్టర్ దయానంద మూర్తి, న్యాయశాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










