ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : వికేంద్రీకరణపై న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లాల వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నం, కర్నూలుతో పాటు అమరావతిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ రాజధానిగా ఉండకూడదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ఈ ప్రాంత వాసులకు సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు తాము మద్దతు తెలియజేస్తున్నామన్నారు జేఏసీ ముఖ్య నాయకులతో గురువారం సమావేశమవుతామని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం కాబట్టే ఈ ప్రాంత ప్రజల మద్దతును తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు అమరావతిలో శాశ్వత రాజధానిని నిర్మించలేకపోయారని, ఆర్థిక వనరులను కూడా సక్రమంగా వినియోగించుకోలేక పోయారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ పాల్గొన్నారు.










