Sep 17,2021 06:40
  • మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాలపై సీతారాం ఏచూరి ఇంటర్వ్యూ


- 3వ భాగం

యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాల ఒత్తిడి వలన సంస్కరణలు అమలు జరగకుండా నిలిచిపోయాయన్న అభిప్రాయం కొంతకాలం ఉండింది. యుపిఎ ప్రభుత్వ విధానాలు నయా ఉదారవాద మార్గం నుండి గణనీయంగా పక్కకు మళ్ళాయా ?
    యుపిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను నిలిపివేసిందని అనలేం. కనీస ఉమ్మడి కార్యక్రమం నయా ఉదారవాద విధానాలను ఏ విధంగా కొనసాగించాలన్నది రూపకల్పన చేసింది గనుకనే యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు బైట నుండి మద్దతునివ్వడానికి మాత్రమే పరిమితం కావాలని నిశ్చయించుకున్నాయి. భారత గణతంత్రపు లౌకిక, ప్రజాస్వామిక స్వభావాన్ని పరిరక్షించడానికి, మతతత్వ శక్తులు అధికారాన్ని కైవసం చేసుకోకుండా నిరోధించడానికి, తద్వారా మన గణతంత్రపు పునాదులు దెబ్బ తినకుండా కాపాడుకోవడానికి ఆ విధమైన మద్దతుని ఇవ్వవలసి వచ్చింది.
     వామపక్షాల ఒత్తిడి కారణంగానే ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందిందన్నది వాస్తవం. ఆ కార్యక్రమంలో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత చట్టం, భూసేకరణపై కొత్త చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి వచ్చాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం గనుక లేకుంటే అటువంటివి వచ్చి వుండేవి కానేకావు.
      మన రాజ్యాంగం పౌరులందరికీ కొన్ని ప్రాథమిక హక్కులను, కొన్ని హామీలను ఇచ్చింది. మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ హక్కులు, హామీలు విస్తరిస్తూ పోవాలన్నది వామపక్షాల బలమైన అభిప్రాయం. ఉద్యోగం పొందే హక్కు మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు కాదు. కాని ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతం వరకు ఆ హక్కును కల్పించగలిగింది. దానికి ఎన్ని పరిమితులు వున్నప్పటికీ, దానిని అమలు చేయకుండా అడ్డుకోడానికి పాలక వర్గాలు పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన హక్కును కల్పించింది.
ఆ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిస్తున్న దశలోనే పట్టణ ప్రాంతాలకు కూడా అదే మాదిరిగా ఒక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకు వస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఆ హామీని అమలు చేయాలని వామపక్షాలు ఇప్పటికీ పట్టుపడుతూనే వున్నాయి. విద్య కూడా మన రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా ముందు పొందుపరచలేదు. యుపిఎ కాలంలో విద్యా హక్కు చట్టం వచ్చింది. సక్రమంగా అమలు జరగనప్పటికీ, ప్రజల హక్కుల విస్తరణే. సమాచార హక్కు చట్టం, గిరిజనుల అటవీ హక్కుల చట్టం కూడా ప్రజల హక్కుల విస్తరణే. ఆ కోణం నుండి చూసినప్పుడు వామపక్షాల ఒత్తిడి గనుక లేకపోయినట్లయితే, ఈ నయా ఉదారవాద విధానాల కాలంలో అటువంటి చట్టాలు వచ్చివుండే అవకాశమే లేదు.


భారతదేశం నయా ఉదారవాద విధానాల వైపు మళ్ళడం వలన దాని ప్రభావం మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏవిధంగా పడుతున్నది? నయా ఉదారవాద విధానాలకు, నియంతృత్వం ప్రబలడానికి ఏమైనా సంబంధం ఉందా ?
     2014లో జరిగినది కార్పొరేట్ల ప్రయాజనాలకు మతతత్వ రాజకీయాలు జతపడి అదొక విషతుల్యమైన సమ్మేళనంగా రూపొందడం. దేశ సంపదను లూటీ చేయడం ద్వారా లాభాలను విపరీతంగా పోగేసుకోవాలనే దూకుడుతో భారీ ఎత్తున ప్రభుత్వరంగాన్ని, ప్రజోపయోగ సర్వీసులను, ఖనిజ సంపద నిల్వలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. క్రోనీ క్యాపిటలిజాన్ని ఇది మున్నెన్నడూ లేనంత స్థాయికి తీసుకుపోయింది. దానితోబాటు రాజకీయ అవినీతి కూడా తారాస్థాయికి చేరింది. దీనితోబాటు ప్రజల ప్రజాస్వామిక హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యమైన దాడి జరుగుతోంది. ఏ విధమైన నిరసన తెలిపినా దానిని జాతీయ వ్యతిరేక చర్యగానే పరిగణిస్తోంది ప్రభుత్వం. విచక్షణా రహితంగా ఉపా వంటి నిరంకుశ చట్టాలను ప్రయోగించి అరెస్టులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో రాజ్యాంగం, అది ప్రజలకు గ్యారంటీ చేసిన హక్కులు దాడికి గురవుతున్నాయి.
      ఇటువంటి విధానాల ఫలితంగా నేడు ప్రపంచం ''ఎన్నికల ద్వారా ఏర్పడిన నిరంకుశ'' పాలన ఉన్న దేశంగా భారతదేశాన్ని పరిగణిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆర్థిక స్వేచ్ఛ మోతాదును నిర్ధారించే గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడం ఇండెక్స్‌ ప్రకారం గతేడాది భారతదేశం 79వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది అది కాస్తా ఏకంగా 105 కు దిగజారింది. మానవస్వేచ్ఛ సూచిక 94 నుండి 111కు దిగజారింది. ఐరాస మానవాభివృద్ధి సూచిక మన దేశ స్థానాన్ని గతేడాది 129గా నిర్ధారించగా ఈ ఏడాది అది 131 కి పడిపోయింది.
      దేశంలోని అత్యధిక మెజారిటీ ప్రజానీకాన్ని పేదరికంలో ముంచడంతోబాటు ఈ పెరుగుతున్న నియంతృత్వం ముస్సోలినీ నిర్వచించిన ఫాసిజం వైపుగా పరిణమిస్తోంది. కార్పొరేట్‌ శక్తులు, ప్రభుత్వం కలిసిపోవడమే ఫాసిజం అని ముస్సోలినీ నిర్వచించాడు.
తానొక జాతీయవాద పార్టీనని బిజెపి చెప్పుకుంటోంది. ఐతే 1990 దశకం ప్రారంభం నుండీ మొదలైన నయా ఉదారవాద విధానాల బాటలోనే ఆ పార్టీ నికరంగా సాగుతోంది. బిజెపి దృష్టిలో ఉన్న నయా ఉదారవాద సంస్కరణలు తక్కిన పార్టీలతో పోల్చితే మరింత దూకుడుగా ఉన్నాయని భావిస్తున్నారా ?
    బిజెపి ఎప్పుడూ రెండు నాలికలతోనే మాట్లాడుతుంది. అది చెప్పేదానికి, ఆచరణలో చేసేదానికి ఏమాత్రం పొంతన ఉండదు. తననొక జాతీయవాద పార్టీగా బిజెపి చెప్పుకుంటుంది. ఒకానొక సమయంలో 'స్వదేశీ' వంటి నినాదాలను ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థను వ్యతిరేకించింది. ఒకసారి అధికార పగ్గాలు చేతికి రాగానే మొత్తం రివర్స్‌ అయిపోయింది.
     ప్రత్యేకించి 2014 నుండి బిజెపి ప్రభుత్వం చాలా దూకుడుగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తోంది. అంతకుముందు ఇంత దూకుడు ప్రదర్శించలేదు. దీనికి వెనుక ఒక కారణం ఉంది. బిజెపి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు యొక్క రాజకీయ అంగం. ఆర్‌ఎస్‌ఎస్‌ మొదటినుంచీ భారతదేశంలో పచ్చి మతవిద్వేషపూరితమైన, ఫాసిస్టు స్వభావం కలిగిన మతరాజ్యాన్ని ఏర్పాటు చేసే రాజకీయ ప్రాజెక్టుతో 'హిందూ రాష్ట్ర' స్థాపన కోసం పని చేస్తోంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో దీనిని ఏర్పాటు చేయలేకపోయింది. కాని అప్పటి నుండి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన మన లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వుంది. దాని స్థానే ఫాసిస్టు 'హిందూ రాష్ట్ర' ను స్థాపించాలని చూస్తోంది.
     అటువంటి ప్రాజెక్టును అమలు చేయడంలో కృతకృత్యం కావాలంటే ఈ ప్రపంచీకరణ యుగంలో అంతర్జాతీయంగా మద్దతు అవసరం. కనీసం అంతర్జాతీయంగా తన ప్రాజెక్టుకు గట్టి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. దూకుడుగా నయా ఉదారవాద సంస్కరణలను అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ మద్దతు పొందడం తేలిక అన్న భావనతో అది వ్యవహరిస్తోంది. తద్వారా అంతర్జాతీయ పెట్టుబడికి, దేశీయ కార్పొరేట్‌ పెట్టుబడికి గరిష్ట లాభాలు సమకూరుతాయి గనుక వాటి మద్దతు పొందవచ్చునని భావిస్తోంది.
 

/ తదుపరి భాగం రేపు /