Sep 29,2023 23:26

  • జెవివి రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-విజయవాడ: ఆధునిక భావాలకు ఆధ్యుడు నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి కొనియాడారు. ఆలిండియా ఘంటసాల చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం సౌజన్యంతో, తెలుగు కళావాహిని, జిఆర్‌కె పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీ హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన ఊరురా జన విజ్ఞానం అభ్యుదయ సాంస్కతిక ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సభకు కోట వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. కన్యాశుల్కం లాంటి నాటకం రచించి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను పారద్రోలేందుకు గురజాడ చేసిన కషిని అందరూ అభినందించాల్సిందే అన్నారు. తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు మాట్లాడుతూ గురజాడ అప్పారావు స్ఫూర్తితో తెలుగులో అనేక రకాలైన సాంస్కత సాంఘిక సంస్కరణ సినిమాలు వచ్చాయని ఇవి ప్రేక్షకులు మన్ననల్ని పొందే అన్నారు. సభానంతరం గాయని గాయకులు సినిమాలోని దేశభక్తి అభ్యుదయ సమాజానికి వెలుగు దారినందించే గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పావని, పడ్డాది కామేశ్వరి, షబానా, విజయ శ్రీ, ఝాన్సీ, శ్యాం ప్రసాద్‌ డేవిడ్‌ రాజ్‌, వెంకట్‌ సుదర్శన్‌ రాజు, కె.వి.కె ఆనంద్‌, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురజాడ రచించిన కన్యాశుల్కంలోని గిరీశం పాత్ర , పుత్తడి బొమ్మ పూర్ణిమ కన్యక వంటి కవితలు వినిపించారు.