Apr 30,2021 07:06

ప్రజాకవితా ప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అగ్రగణ్యుడు. మనకు మహారాజశ్రీలు, బ్రహ్మశ్రీలు చాలామంది శ్రీలు ఉన్నారు. కానీ శ్రీశ్రీ ఒక్కడే. ఈయన్ను కవితాశ్రీ, అరుణశ్రీ, ప్రజాశ్రీ, చైతన్యశ్రీ అని ఏదైనా అనొచ్చు. శ్రీ అంటే అమృతం, శ్రీ అంటే విషం.. వెరసి శ్రీశ్రీ అంటే కవిత్వం అన్నారు ఆరుద్ర. తెలుగు జాతి అత్యంతగా స్మరించుకునే చరణాలు, వాక్యాలు, భాష వీటిలో శ్రీశ్రీ ముందుంటాడు. వేమన, అన్నమయ్య, పోతన .. ఇటువంటి వాళ్ల పదాలు వాడుక భాషలో, జానపద గీతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశ్రీ పదాలూ చాలా ఎక్కువగా వాడతాం. శ్రీశ్రీ చరణాలు, శ్రీశ్రీ పదాలు, శ్రీశ్రీ ప్రయోగాలు లేని రోజుగానీ మీడియా గానీ సభలు గానీ అస్సలు చూడం. తెలుగుజాతి ఆధునికతకు గురజాడ అప్పారావు అంకురార్పణ చేస్తే, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అక్షరాలలో అరుణారుణోదయం తీసుకొచ్చిన మహావ్యక్తి శ్రీశ్రీ. అందుకే శ్రీశ్రీ 'యుగకర్త' అయ్యారు. కొన్ని కవితలు, చరణాలు చెప్పుకోవడమే కాకుండా సమగ్ర చారిత్రక కోణంలో చూస్తే శ్రీశ్రీ ఒక తరానికి, ఒక స్వరానికి, నవచైతన్యానికి ప్రతీకగా మన ముందు నిలబడతాడు.
శ్రీశ్రీ ఏ భావాలకు వ్యతిరేకంగా పోరాడారో, ఏ సమానత్వం, సమ న్యాయం, సామాజిక న్యాయం కోసం, స్వతంత్రత కోసం సామ్యవాద దృష్టితో గొంతెత్తాడో అవన్నీ కూడా సవాలు చేయబడుతున్న ఈ తరుణంలో శ్రీశ్రీ మరింతగా మార్గదర్శకుడు, అవుతున్నాడు. మందగించక ముందుకడుగేరు.. వెనకడుగు పడితే వెనకేనోరు అన్నాడు గురజాడ అప్పారావు. దానికి కొనసాగింపుగా.. 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి' అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు పరమ ఛాందస మతతత్వ శక్తుల దాడి పెరుగుతున్న వేళ ఆ సందేశం మరింత అర్థం సంతరించుకుంటుంది. యాదృచ్ఛికంగా, కృత్రిమంగా భావజాలాన్ని వంటబట్టించుకొని కవి కావాలని అయినవాడు కాదు. స్వతస్సిద్ధంగా అధ్యయనం, అనుశీలన, పరిశీలన ద్వారా చాలా సహజంగా మహాకవి అయిన వ్యక్తి శ్రీశ్రీ. తొలి దశలో రాసిన భావకవిత్వాన్ని పక్కనబెడితే 'మహాప్రస్థానం'లో మొదటి గొప్ప భావగీతం జయభేరి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.. నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారవోశాను.. నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను..అని 1934లో 'జయభేరి' మోగించాడు. మహాప్రస్థానం పరంపరలో మొట్టమొదటి కవిత జయభేరి. ఆ ఏడాదే ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. అప్పుడే అభ్యుదయ భావాలు పెల్లుబికాయి. సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోరు అన్నదానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను... అనేది. నేను కూడా ప్రపంచాగ్నిలో ఉన్నాను అని అర్థం. ఆ తర్వాత భాగంలో మళ్లీ వ్యక్తి పాత్ర కూడా ఉంది. ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాలిపోలేదా.. శీతకాలం కూతపెట్టగా ఆకలేసి కేకలేసేనే.. వానకాలం మురిసిరాగ.. అంటూ మూడు కాలాల్లో ఇలా అల్లాడాను కానీ నిలబడతాను. నేనొకడిని విడిచిపోతే చండ్రగాడ్పులు వానమబ్బులు భూమిమీద భుగవుతాయి.. నేనొక్కడిని లేకపోతే జరగదు, నేను కూడా ఈ ప్రపంచంలో జయభేరి మోగిస్తాను అని, చివరకు వచ్చేసరికి నేను సైతం భువనభవనపు బావుటానై పైకి లేస్తాను అని ప్రకటించాడు. వ్యక్తి, వ్యవస్థ రెండింటి సమ్మేళనం ఎలా ఉంటుంది, వ్యక్తి పాత్ర ఎలా ఉంటుంది అని చెప్పడానికి జయభేరి గీతం ఒక ప్రతీకగా, పతాకగా నిలబడింది. భువనభవనపు బావుటానై పైకి లేస్తాను.. కానీ ఈ బావుటా ఏమైంది.. పదండి ముందుకు పదండి తోసుకు అని ముందుకు పోతూపోతూ ఉంటే ఏమైంది ఆ పతాక ఆ పతాకం ఎర్రబడింది. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు.. హోమ జ్వాలల భుగభుగలు.. ఎర్రబావుటా నిగనిగలు.. ఆ బావుటా వ్యక్తి ఆత్మగౌరవం, ఆశయం, వాటి కోసం నిలబడే లక్షణం ఏమైంది? ఎర్రబారింది ఆ పతాకం. ఆ మహాప్రస్థాన క్రమంలో శ్రీశ్రీ కవిత్వం ఎర్రబారింది. తన కవితలు ఎర్రబడడం కాదు, తెలుగు కవిత్వమే ఎర్రబడింది.
   పదండి ముందుకు నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అని శ్రీశ్రీ అన్నప్పుడు.. ఏ అడ్డంకులున్నా ముందుకు పోవాలి. త్యాగాలు చేస్తూ పోవాలి. దారిపొడుగునా గుండెనెత్తురు తర్పణ చేస్తూనే. ఇది శ్రీశ్రీ కవిత రాయడం కాదు, తెలుగు కవిత్వాన్ని పదండి ముందుకు అని పంపించడంలో అది కదిలేదిగా ఉండాలి. ఒక పరిణామ క్రమం ఉంటుంది. స్తబ్దంగా ఉండదు. అందుకే మీడియా, ఆంధ్రపత్రికలను గురించి విమర్శ చేస్తూ.. యథాస్థితికి కంచుకోట ఆస్తికి పోలీసు అంటాడు. యథాస్థితి అలాగే ఉండకూడదు, కదలాలి. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్దుర వదిలించేదిగా ఉండాలని కవిత్వంలో కదలిక తీసుకురావడం అనేది శ్రీశ్రీ గొప్ప విజయం. శ్రమజీవులను, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదనే కొత్త నినాదం తీసుకొచ్చాడు. ఇలా దేశభక్తి నుంచి, భావ కవిత్వం నుంచి ఇంకా అదనంగా ఒక అడుగు వేయించి సామ్యవాద సమతా చైతన్యాన్ని తీసుకొచ్చి శ్రమజీవికి పట్టంగట్టి శ్రమైక జీవనమే అత్యంత సౌందర్యవంతమైనది అని ఊరికే కాదు కవితాత్మకంగా చెప్పిన వ్యక్తి శ్రీశ్రీ. ప్రపంచపు బాధ అంతా తన బాధగా చేసుకున్నందుకే ఆయన ప్రపంచ కవి అయ్యాడు. ప్రపంచ కవివేనా నువ్వు అని శ్రీశ్రీ తనకు తాను ప్రశ్న వేసుకొని 'నేను మరో ప్రపంచ కవిని' అన్నాడు.
   మరో ప్రపంచం అంటే స్వర్గం, వైకుంఠం, కైలాసం కాదు. మానవ లోకాన్ని కావున లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదనలు, దారిద్య్రాలు, దౌర్జన్యాలు, పరిష్కరించే బహిష్కరించే పాటను తీస్తూ, బాటను వేస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం అని.. అంటే కొత్త ప్రపంచం నిర్మించడం. మన ప్రపంచమే మరో ప్రపంచం అవుతుంది. ఆ మరో ప్రపంచం పిలుస్తోంది. దానికోసం శ్రీశ్రీ సమాయత్తం చేస్తున్నాడు. దీనికోసం కావాల్సిన పదసంపద, కొత్త భాషను ఆయన సృష్టించాడు. ఇప్పుడు జగన్నాథ రథమో లేకపోతే దగాపడిన తమ్ముడనే మాట ఉంది. శ్రీశ్రీ కంటే ముందు ఆ ప్రయోగం లేదు. కాదేదీ కవితకనర్హం అన్నాడు. ఇప్పుడు కాదేదీ లంచానికనర్హం, కాదేదీ కట్నానికనర్హం, కాదేదీ దోపిడీకనర్హం... ఇలా అంటుంటాం. వీటన్నింటికీ మూలం ఎక్కడ అంటే శ్రీశ్రీ దగ్గరికి వెళ్లాల్సిందే! ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం.. నరజాతి చరిత్ర మొత్తాన్నీ అతి క్లుప్తంగా తేల్చాడు. గతితార్కిక చారిత్రక భౌతికవాదంలో చెప్పిన మొత్తం సత్యాలను శ్రీశ్రీ ఒక్క గేయంలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం.. దరిద్రులను కాల్చుకు తినడం.. ఇలా చెబుతూ వచ్చాడు. 'ఇంకానా.. ఇకపై చెల్లదు ' అని చెప్పడం శ్రీశ్రీ కవిత్వం పరమార్ధం. ఆ లక్ష్యాన్ని ఆయన చాలా జయప్రదంగా చేరుకున్నాడు. దానికోసం పురాణాలను, చరిత్రను, భాషను, సంస్కృతిని, అంతకు ముందున్న ఆచారాలను.. ఉదాహరణకు కర్మ సిద్ధాంతం మనది. మాయంటావా? మిథ్యంటావా? అన్నీ మిథ్యేనా? మిథ్య కాదు, కర్మ కాదు ఇది నిజం అని స్పష్టం చేశాడు. ఇది మాత్రమే అయితే శ్రీశ్రీని ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రజలు తలచుకునేవాళ్లు కాదు. ఏ లక్షణాలనైతే తను సాహిత్యంలో ప్రస్తావించాడో వాటి కోసం పోరాడే శక్తులకు సంఘీభావం చెప్పగలిగిన లక్షణం కూడా శ్రీశ్రీకి ఉంది. మేమే గొప్పవాళ్లం, మాకు పల్లకీలు, సన్మానాలు, శాలువాలు కావాలంటారు. శ్రీశ్రీ అలా కాదు. 'ఈ విశాల జగతిలోన ఏమిటి నే కోరినాను ఒక దోసెడు సానుభూతి.. ఒక పిడికెడు తిరుగుబాటు.. కొంచెం సానుభూతి, కొంచెం తిరుగుబాటు వస్తే చాలు...నాకు అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు' అన్నాడు. దానికోసం తిరుగుబాటు చేస్తున్న శక్తులకు నా ఆహ్వానం, వారికి నా సెల్యూట్‌ అన్నాడు. సెల్యూట్‌ పెట్టి ఊరుకోలేదు. వాళ్లతోపాటు ఉద్యమంలో పాల్గొన్నాడు. 1955లో కమ్యూనిస్టులు గెలుస్తారన్నప్పుడు అందరూ దాడిచేస్తే శ్రీశ్రీ ఒక్కడే వాళ్లతోపాటు నికరంగా నిలబడినందుకు ఆయన మీద విపరీతమైన దాడి చేశారు. ఆయన తలకు దెబ్బ తగిలి మతి చలించిన పరిస్థితి వచ్చింది. ఆయన బుర్ర కొంచెం చలించి చికిత్స తీసుకున్నాడు గానీ బుర్రలో ఉన్న భాష్యకం మాత్రం చలించలేదు. చికిత్స పూర్తికాగానే మళ్లీ 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం' అని ఆయన వచ్చాడు. చివరి వరకూ ఆ పోరాట పథంలోనే వున్నారు.
   కరోనా వచ్చిన తర్వాత వలస కార్మికుల సమస్య వస్తే అందరూ ఎవరిని తలచుకున్నారు? పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. అని శ్రీశ్రీ రాసిన దాన్నే మళ్లీ ప్రజలు తలచుకున్నారు. ఆందోళన జీవులు అని ప్రధాని మోడీ అన్నప్పుడు అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి అన్న మహా కవి వాక్యాలను గుర్తు చేసుకున్నాం. అదే ఆయన విశిష్టత. తమ కాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తును కూడా చూడగలిగిన వాళ్లు మహాకవులు అన్నాడు శ్రీశ్రీ. అటువంటి దార్శనికతను చూపించగలిగాడు కాబట్టే శ్రీశ్రీ సదా స్మరణీయుడు, అనుసరణీయుడు, వైతాళికుడు.
 

* నేడు శ్రీశ్రీ 110వ జయంతి

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి