చామంతి, బొడ్డు చామంతి, కర్పూర చామంతి, గడ్డి చామంతి, చిట్టి చామంతి ఇలా చామంతిలో రకాలు మనకు తెలుసు. ఇవి క్రిశాంతిముమ్ జాతికి చెందిన సీజనల్ పూల మొక్కలు. వీటిలో ఇటీవల కాలంలో సరికొత్త రంగులతో వినూత్న రూపాల్లో... ఆహా! అనిపించే మొక్కలు వచ్చాయి. ఈ సరికొత్త హైబ్రీడ్ చామంతులు రంగు, వాసన, పరిమాణం, నిగారింపు అన్నీ సాధారణ చామంతులతో పోలిస్తే విభిన్నంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.
విభిన్న ఆకృతుల్లో నవ్య చామంతులు పలకరిస్తున్నాయి. సరికొత్త రంగుల్లో పులకిస్తున్నాయి. నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో తయారుచేస్తున్న ఈ సరికొత్త చామంతులు ఈ ఏడాది మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కడియం నర్సరీల్లో ఎక్కడ చూసినా హడావుడి అంతా ఈ నవ్య చామంతులదే. సీజనల్ పూలలో రారాజుగా వర్థిల్లే చామంతులు సాధారణంగా నవంబర్ నుంచి మార్చి వరకూ పూస్తాయి. తోటలు వేసే దేశవాళీ చామంతుల మాత్రం ఏడాదిలో తొమ్మిది నెలలు పూస్తూనే ఉంటాయి.
బొకే చామంతులు
కుండీల్లో లేదా ప్లాస్టిక్ కవర్లో గుంపుగా కొమ్మలు వచ్చి దట్టంగా పువ్వులు విచ్చుకుంటాయి. కుండీలోంచి ఒకేసారి వందల సంఖ్యలో పువ్వులు విరుస్తాయి. చూడ్డానికి అచ్చంగా బొకేల్లా ఉంటాయి ఇవి. ఈ పువ్వులు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరి వరకు గుబాళిస్తాయి. చూడగానే కనువిందు చేస్తాయి. తెలుపు, నీలం, పింకు, కాషాయం, మల్టీకలర్ రంగుల్లో పువ్వులు పూసే మొక్కలు ఈ జాతిలో ఉన్నాయి. శీతల ప్రాంతాల్లో మరీ బాగా విచ్చుకుంటాయి. ఇటీవల బొకేల్లా ఈ పూలమొక్కలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇండికమ్ గ్రీన్
ఆకుపచ్చని పూరేకలుండే అరుదైన పుష్పం ఈ చామంతి. పువ్వు చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఒక్కో పువ్వు మూడురోజుల పాటు విచ్చుకుంటుంది. మొక్క నుంచి తుంచకుండా ఉంటే పువ్వు 10 రోజుల వరకూ వాడిపోకుండా ఉంటుంది.
పీచుమిఠాయి చామంతి
పూరేకులు సన్నని కేసరాల్లా ఉండి, పువ్వు చూడ్డానికి అచ్చంగా పీచుమిఠాయిలానే ఉంటుంది. దీని శాస్త్రీయ నామం 'అనేమోన్ అల్పిన'. పువ్వు లేత గులాబీ రంగులో ఉంటుంది. తెలుపు, ఎరుపు, నారింజ రంగుల్లోనూ వీటి పువ్వులు ఉంటాయి.
బహుళవర్ణాల్లో..
పూరేకులు తెలుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో భలే కాంతివంతంగా ఉంటాయి. ఇవి బంతి ఆకారంలో గుండ్రంగా ఉండే పువ్వులు. ఇందులో తెలుపు, పసుపు, కాషాయం, లేత గులాబీ, నారింజ రంగుల్లో పువ్వులు కొలువుదీరి ఉంటాయి. పువ్వులు విచ్చుకున్నంతసేపూ లేత సువాసనలు వెదజల్లుతాయి. రెండురోజులకోసారి కొద్దిగా నీరుపోస్తే సరిపోతుంది.
డెండ్రాంన్తేమ గ్రాండిఫ్లోరా
దళసరిగా ఉండే పూరేకులు వంపులు తిరిగి, పువ్వు భలే అందంగా ఉంటుంది. కొన్ని పువ్వులు అరచేతి పరిమాణం వరకూ విచ్చుకుంటాయి. లేత వయొలెట్ రంగులో పువ్వులు ఎంతో రమణీయంగా కాంతులీనుతాయి. వీటిలో రంగులు కూడా ఉన్నాయి. అగర్ బత్తులు, సుగంధ తైలాల్లోనూ ఈ పువ్వులను వినియోగిస్తారు.
నీలం చామంతులు
చాలా అరుదైన పువ్వులు నీలం చామంతులు. కాల్లిస్టెప్స్ చైననిన్ వీటి శాస్త్రీయ నామం. లేత నెరేడు పండు రంగులో పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి.
కేసరి చామంతి
పూరేకులు చాలా దళసరిగా, పొడవుగా ఉంటాయి. పువ్వు విచ్చుకున్నట్టు కాకుండా కిందికి రేకలు వాలినట్టు ఉంటాయి. పువ్వు చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. సింహం జూలు మాదిరిగా పువ్వు రేకులు ఉండటంతో దీన్ని కేసరి చామంతి అంటారు. దీని శాస్త్రీయ నామం టెలోసిమ స్పీసీయషిసెస్స్. డాలియా, చామంతుల సంపర్కం ద్వారా ఈ మొక్కలు వృద్ధి చేశారు. వీటిని జర్మనీ చామంతులు అనీ అంటారు.
మీసపు చామంతి
పూరేకులు సన్నని తీగల్లాగా, గొట్టాల్లాగా, పొడవుగా భలే గమ్మత్తుగా ఉంటాయి. అందుకే వీటిని మీసపు చామంతి అంటారు. పువ్వులు పెద్ద పరిమాణంలో ఉంటాయి. రేకులు తెలుపు, గులాబీ రంగుల కలబోతతో కాంతులు విరజిమ్మినట్టుగా ఉంటాయి.
డైసీ చామంతులు
పువ్వులు వంగపువ్వు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మధ్యలో పుప్పొడి, బొడ్డు చుట్టూతా పలుచని రేకులతో నాజుగ్గా ఉంటుంది. మొక్క నిండుగా పువ్వులు పూస్తాయి. తుంచినా రెండు రోజుల వరకూ పూలు పాడవ్వవు. అందుకే అలంకరణకు వీటిని ఉపయోగిస్తారు.
- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506