భారత రక్షణమంత్రి సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : నవ్య ఆవిష్కరణలకు వేదికలుగా విశ్వవిద్యాలయాలు నిలుస్తాయని భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఎయులోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆత్మనిర్భర్ భారత్ అంశంపై మాట్లాడుతూ, దేశం ఆర్ధికంగా పురోభివృద్ది సాధించాలంటే అత్యాధునిక సాంకేతికతో పనిచేయడం ఎంతో అవసరమన్నారు. నూతన ఆలోచనలతో యువత వస్తే వారికి ప్రోత్సాహం, ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో విభిన్న శాస్త్రఅంశాల్లో ప్రోత్సహించడానికి, డిఆర్‌డిఒ పది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందన్నారు.. దేశ రక్షణ రంగానికి ఉపయుక్తంగా పనిచేసే స్టార్టప్, ఎంఎస్‌ఎంఇ, ఇంక్యుబేషన్‌లకు రూ.50కోట్లు వరకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో దేశీయంగా కేవలం నాలుగు నెలల కాలంలో 60 వేల వెంటిలేటర్లను సిద్ధ్దం చేసామన్నారు. తేజన్ ఫైర్ క్రాఫ్ట్‌లు, అర్జున్ ట్యాంక్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఆర్టిలరీ గన్ వంటివి దేశీయంగా తయారు చేసినవేనన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయంశక్తితో ఎదగడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 2016లో దేశంలో కేవలం 471 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, నేడు 75 వేలకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యాసంస్థలు ముందంజలో ఉన్నాయన్నారు. ఒకపుడు దిగుమతులపైనే ఆధారపడిన రక్షణరంగం, నేడు ఎగుమతులు చేస్తే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అంతకుముందు ఎయు జియో ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల డ్రోన్ సర్వే మ్యాపింగ్ -నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సతీష్‌రెడ్డి ప్రారంభించారు. విసి పివిజిడి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌కు ఎయు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఎన్.కిషోర్‌బాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పేరి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్ వై.రాజేంద్ర ప్రసాద్, ఎస్‌కె భట్టి, కె.విశ్వేశ్వరరావు, టి.శోభశ్రీ, వి.విజయలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సతీష్‌రెడ్డి సమాధానాలిచ్చారు. అనంతరం వర్సిటీ తరపున సతీష్ రెడ్డిని సత్కరించారు.










