నవ్వు నాలుగు విధాల చేటు అని ఛాందసవాదులు హసనాన్ని చీత్కరిస్తే - నవ్వు నలభై విధాల గ్రేటు అని ఆధునికులు చిర్నవ్వుకు జేజేలు పలికారు. ఎంత నవ్వినా వచ్చిన నష్టం ఏమీ లేదని, నవ్వుల పాలు కాకుండా మాత్రం ఉండాలని పెద్దలు సదా హెచ్చరిస్తూ ఉంటారు. నిజానికి నవ్వు అనేది కేవలం ఒక్క వ్యక్తీకరణ కాదు; అది అనేక భావాల ఖజానా. చిర్నవ్వు, సాదా నవ్వు, వంకర నవ్వు, వయ్యార నవ్వు, ఎగతాళి నవ్వు, ఎకసెక్కపు నవ్వు, భరోసా నవ్వు, భయపెట్టే నవ్వు, విషపు నవ్వు, విడ్డూరపు నవ్వు ... ఇలా నవ్వుల రకాలు నానా విధాలు. సందర్భాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అవి వెల్లి విరుస్తూ ఉంటాయి. ఏ నవ్వు వెనక ఏ భావం ఉందోనని సంశయాలు చెలరేగటం అందుచేతనే మరి! ద్రౌపది ఎందుకు నవ్విందో ఏమో కానీ, అది కచ్చితంగా తనను అవమానించటానికేనని అనుమానించాడు దుర్యోధనుడు. అది కాస్త పగలూ ప్రతీకారాలుగా తీగలు సాగి, కురుక్షేత్రమనే మహా సంగ్రామానికి దారి తీసింది. ప్రఖ్యాత చిత్రకారుడు లియనార్డో డావిన్సి గీసిన మొనాలిసా చిత్రంలో నవ్వుందా? విషాదముందా? అన్నది ఇప్పటికీ తేలని ప్రశ్నగానే ఉంది.
నవ్వు ఆధారంగా మనకున్న సామెతలూ, సందర్భ సహిత నానుడులూ బోలెడు. నవ్విన నాపచేను పండదా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నవ్వూ నవ్వించు వంటి వాడుకలు ప్రతినిత్యం మనం ఇంటా బయటా వింటూనే ఉంటాం. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా నవ్వుల వైద్యాలయాలు, నవ్వుల శిక్షణా కేంద్రాలు ఉన్నాయంటే- నవ్వు అవసరం ఎంతో మనకు అర్థమవుతుంది. మనిషిని, జంతువునీ వేరు చేసి చూపించే ముఖ్య లక్షణంలో నవ్వొకటి. ఆమాస చీకటి వంటి విషాదం కమ్మిన ముఖంలో పున్నమి జాబిలి లాంటి నవ్వు ఒక గొప్ప వెలుగు. 'నవ్వు లేనినాడు నువ్వూ లేవూ నేనూ లేను' అని ఓ కవి బాధపడ్డం వెనక అసలర్థం నవ్వంటే కేవలం నవ్వని మాత్రమే కాదు. ఇక్కడ నవ్వంటే ఒక పరిపూర్ణమైన జీవితం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా .. ఇలా అన్ని విధాలా ఉన్నతస్థితిని చాటే ఒక సంతోషపు కొలమానం. అలాంటి లెక్కల్లో చాలా చిన్న దేశమైన భూటాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటే- మనమేమో 120వ స్థానంలో విచారగ్రస్త వదనంతో కొట్టుమిట్టాడుతున్నాం.
కోవిడ్ ఇంతగా కోరలు చాచి విస్తరిస్తున్న సమయంలో జనం ముఖాల మీద నవ్వు విరబూయడం సాధ్యం కాని సంగతి. పాలకుల పూచీ లేని తనం అడుగడుగునా అయోమయం, అనిశ్చితి, భయాందోళనల వాతావరణాన్ని సృష్టిస్తే- ఇక నవ్వులెలా వినిపిస్తాయి? తిండికి, బట్టకి, చదువుకి, ఉపాధికి పోటాపోటీగా వరసలు కట్టినట్టే- ప్రాణాలు కాపాడుకోవటానికి, ఆఖరికి కన్ను మూస్తే కడసారి క్రియలు నిర్వహించటానికి కూడా క్యూలు కట్టాల్సిన దౌర్భాగ్య స్థితిలో దేబిరిస్తున్నాం మనం. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇంకెక్కడ నవ్వుల సవ్వడి వినిపిస్తుంది ?
నవ్వడం, ఏడవడం అనేది కేవలం ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. తెల్లని మల్లెపువ్వు లాంటి దరహాసంతో పరిమళించటానికి, బండెడు భారంతో దు:ఖసముద్రంలా కునారిల్లిపోవటానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలూ, పాలకులే ప్రప్రథమ కారణం. కరోనా విపత్తును ఆదిలోనే అరికట్టే వ్యూహంతో కేంద్ర పాలకులు పూనుకుంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టం ఉండేదా? గుళ్లూ గోపురాలూ, విగ్రహాలూ యుద్ధాగ్రహాలకూ బదులు వైద్యాలయాలను, వాటిలోని సదుపాయాలను తగినన్ని సమకూర్చుకుంటే ఇంత దు:ఖం వరదలై ప్రవహించేదా? ఆవు మూత్రంతోనూ, గంగాజలంతోనూ, పేడ అలుకుడుతోనూ, హనుమాన్ చాలీసాతోనూ వైరస్‌ను వణికించి చంపేయొచ్చని అధికారంలో ఉన్న పెద్ద తలకాయలే నానా అజ్ఞాన కూతలూ కూస్తుంటే- ఇక వారి ఆచరణ ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోలేమా? మేము చాలా గొప్పని చెప్పుకోవటానికి ఇక్కడ ఉత్పత్తయిన టీకాలను విదేశాలకు పంపేసి, దేశాన్ని విపత్తులోకి నెట్టేసిన పాలకులను చూసి ఇప్పుడు ప్రజలు ఏడ్వలేక నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తత్వం గద్దె మీద ఉన్న పాలకులది. నవ్వుతూ పది కాలాల పాటు బతకాలని ప్రజలు అనుకోవటం అత్యాశ కాదు. ఆ ఆశకు అడ్డంకిగా మారినవారితోనే సమస్య.










