Jul 09,2023 21:07

సభలో మాట్లాడుతున్న తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షులు అనిత

ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నవరత్నాలు కాదని, నకిలీ రత్నాలని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా లెప్రసీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, తెంటు లక్ష్మునాయుడు, భంజ్‌ దేవ్‌, విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాం మల్లిక్‌ నాయుడు, మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి జి.సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత వెంకటేశ్వరాలయాన్ని దర్శించారు, అనంతరం డీలక్స్‌ సెంటర్‌లధున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న వందపడకల ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సభలో అనిత మాట్లాడుతూ కుటుంబంలో చదువుతున్న పిల్లలందరికీ అమ్మ ఒడి మంజూరు చేస్తానని చెప్పిన సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక బిడ్డ కే మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇద్దరు, ముగ్గురు బిడ్డలున్న పేదకుటుంబంలో మిగిలిన పిల్లలను ఎలా చదివించుకుంటారని ప్రశ్నించారు. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో చదువుతున్న పిల్లలందరికీ అమ్మఒడి వర్తింపజేయనున్నారని చెప్పారు. జగన్‌ పాదయాత్రలో 45 ఏళ్లు దాటిన వృద్దులందరికీ పింఛను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్‌ మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమందికీ నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేయాలని టిడిపి నిర్ణయించినట్లు చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ,గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, అందుకే ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌, బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయని, పేదలపై పెనుభారం పడిందని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పారు. 2009నుంచి టిడిపి ఈ నియోజకవర్గంలో ఓడిపోతోందని, ఈ సారి టిడిపి ని గెలిపించాలని కోరారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర నియోజకవర్గంలో కనీసం గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించలేదన్నారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులు భూకబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైకో జగన్‌ మళ్లీ సిఎం అయితే ప్రజలు నిలువుదోపిడీ చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన అభివవృద్ధి ఏమీ లేదని చెప్పారు. సబ్‌ ప్లాన్‌ నిధుల్లేక ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పనులు లేవని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో సంధ్యారాణిని గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఆ దిశగా గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని లలిత కుమారి కోరారు. మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు మాట్లాడుతూ పట్టణంలో వందపడకల ఆసుపత్రిని గతంలో టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంత వరకు డిప్యూటీ సిఎం రాజన్నదొర ఎందుకు దాని నిర్మాణం పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొర నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వారిపై వైసిపి బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. యువతకు ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని చెప్పిన సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగేళ్ల లో యువకులకు గంజాయి, మద్యం సరఫరా చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు టిడిపిని అధికారంలోకి తేవాల్సిన అవసరం వుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ కావాలని అడిగి అధికారంలోకి వచ్చిన వైసిపి పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. సాధ్యం కాని హామీలిచ్చి మోసగించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం జగన్‌ చేసిన మొదటి ఘనకార్యం అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రివర్స్‌ టెండర్‌ పిలిచి నిర్మాణపురోగతి అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు లు ఎన్ని మొట్టికాయలు వేసినా సిఎం జగన్‌ కి సిగ్గు ఎగ్గూ లేదన్నారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి మాట్లాడుతూ డిప్యూటీ సిఎం ఉండీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు వేగంగా జరగడంలేదన్నారు. ఇప్పటివరకు ముగ్గురు కాంట్రాక్టర్లు మారారని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనకు శిక్షణ ఇవ్వడానికి నిర్దేశించిన వైటిసిని ప్రభుత్వం గాలికొదిలేసినట్లు చెప్పారు. గిరి శిఖర గ్రామాల కు చెందిన గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్‌ను నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో సరైన నాయకులు అధికారం ఉంటే పాలన బాగుంటుందని చెప్పారు. గడిచిన నాలుగేళ్ల లో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సిఎం జగన్‌ మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పి అసలు రాజధాని లేకుండా చేశారని చెప్పారు. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు అభివద్ధి పనులు కూడా కోరుతున్నారని చెప్పారు. సిఎం గత ఎన్నికల ముందు సొంత బాబారు వైఎస్‌ వివేకానందరెడ్డి రెడ్డిని చంపించి టిడిపి నాయకులపై నేరం పెట్టారని చెప్పారు. సంపూర్ణ మద్యనిషేధం పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొర నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కనీసం రోడ్లు కూడా నిర్మించలేదన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం బోర్డు తగిలించి వదిలేశారని ఎద్దేవా చేశారు. టిడిపి ప్రభుత్వం హయాంలో పేదల కోసం అన్నా కేంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్‌ ప్రభుత్వం ఎత్తివేయడం దారుణమని అన్నారు. నిరుపేదలకు కడుపునిండా తిండి పెట్టకపోవడం ద్వారా జగన్‌ శాడిజం బయటపడిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ బస్సు యాత్రకు స్పందన అంతంతమాత్రమేనని తెలుస్తోంది. బస్సు యాత్రలో పాల్గొన్న కొంత మంది సీనియర్‌ నాయకులు సభకు హాజరు కాలేదు.