ప్రజాశక్తి-కాకినాడ నవరత్నాలు-ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 8,877 మందికి రూ.11.44 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ ఆవాల రాజేశ్వరి గ్రామీణాభివృద్ధి, విద్య, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు, విద్యార్థులకు రూ.11.44 కోట్ల మెగా చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పథకాల లబ్ధి మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించినట్టు చెప్పారు. అర్హత ఉండి ఏ కారణంచేతనైనా లబ్ధి చేకూరకుండా ఉంటే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, బిసి సంక్షేమ శాఖ అధికారి ఎస్‌విఎస్.సుబ్బలక్ష్మి, సాంఘిక సంక్షేమ జేడీ డివి.రమణమూర్తి, మత్స్యశాఖ జేడీ పీవీ సత్యనారాయణ హాజరయ్యారు.










