Aug 24,2023 20:24

ప్రజాశక్తి - ఏలూరు
          నవరత్నాల ద్వైవార్షిక నగదు మంజూరుకు అర్హులై ఉండి ఏ కారణంచేతనైనా లబ్ధిఅందని 5024 మంది ఖాతాలకు రూ.5.86 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నవరత్నాలు-ద్వైవార్షిక నగదు 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సిఎం జగన్‌ జమచేశారు. కలెక్టరేట్‌ నుంచి ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, సాంఘీక సంక్షేమశాఖ జెడి.జయప్రకాష్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎన్‌.పుష్పలత, జిఎస్‌ డబ్ల్యూఎస్‌ నోడల్‌ అధికారి రమణ, పలువురు విద్యార్థులు, లబ్దిదా రులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మెగా నమూనా చెక్కును కలెక్టర్‌ లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల మంజూ రులో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధిఅందని లబ్దిదారులను ప్రతీఏడాది జూన్‌, డిసెంబరు నెలలను ప్రాతిపదికగా గుర్తించి వారికి మరో అవకాశం ఇస్తున్నారన్నారు. ఈ విధంగా జిల్లాలో 5024 మందిని గుర్తించి రూ.ఐదు కోట్ల 86 లక్షల 17 వేల 301 ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. చేదోడు కింద రూ.10 వేలు చొప్పున 1771 మందికి రూ. 1.77 కోట్లు, జగనన్న వసతి దీవెన రూ.10 వేలు చొప్పున 1099 మందికి రూ.1.03 కోట్లు, విద్యాదీవెన 985 మందికి రూ.1.42 కోట్లు, అమ్మఒడి రూ.15 వేలు చొప్పున 702 మందికి రూ.1.05 కోట్లు, ఇబిసి నేస్తం రూ.15 వేలు చొప్పున 306 మందికి రూ.45.90 లక్షలు, రైతు భరోసా 156 మందికి రూ.11.42 లక్షలు, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం రూ.24 వేలు చొప్పున నలుగురికి రూ.96 వేలు, మత్య్సకార భరోసా ఒకరికి రూ.10 వేలు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.