Aug 08,2021 15:50

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ 'నవరస' వివాదంలో చిక్కుకుంది. అంథాలజీ వెబ్‌ సిరీస్‌గా మణిరత్నం నిర్మించిన 9 లఘు చిత్రాల సంకలనమే ఈ 'నవరస'. దీనిని ఇటీవల నేరుగా ప్రముఖ ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. అరవింద్‌ స్వామి, గౌతమ్‌ మీనన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, ప్రియదర్శన్‌ లాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ప్రేక్షకుల నుంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే, సిద్ధార్థ్‌, పార్వతీ నటించిన 'ఇన్మై' సెగ్మెంట్‌పై కొందరు ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ 'నవరస' ప్రచారంలో భాగంగా 'ఇన్మై' సెగ్మెంట్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ విడుదల చేసింది. అందులో సిద్ధార్థ్‌, పార్వతీ ముఖాల వెనుక, బ్యాక్‌ గ్రౌండ్‌లో ఖురాన్‌కు చెందిన పదాలు, పంక్తులు ఉన్నాయి. ఖురాన్‌లోని ఏ భాగాన్ని కానీ పోస్టర్ల మీద, ఇతర చోట్ల అచ్చువేయటానికి ముస్లింలు ఒప్పుకోరు. అది వారికి పవిత్రం కావటంతో ప్రార్థన కోసం తప్ప ఇంక దేనికీ వారు వాడరు.

Navarasa : చిక్కుల్లో మణిరత్నం 'నవరస'.. నెట్‌ఫ్లిక్స్‌నే బ్యాన్‌ చేయాలంటూ..!

అయితే, నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో ఖురాన్‌లోని కొంత భాగం అచ్చై ఉండటం కొందరికి ఆగ్రహం కలిగించింది. ఇది ఖురాన్‌ను అవమానించడమే అని వారు ఆరోపిస్తున్నారు. అలా పబ్లిసిటీకి వాడుకున్నందుకే వారంతా ఇప్పుడు 'బ్యాన్‌ నెట్‌ ఫ్లిక్స్‌' అంటున్నారు. హ్యాష్‌ ట్యాగ్‌ నడుపుతున్నారు. ట్విట్టర్‌లో ఇప్పుడు ఇది ట్రెండింగ్‌గా మారింది. కాగా ఈ వివాదంపై మణిరత్నం గానీ, ఈ భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు గానీ ఇంకా స్పందించలేదు.