ప్రజాశక్తి -ముంచింగిపుట్టు :మండలంలోని అతి మారుమూల వనగుమ్మ పంచాయతీ కిరంబో గ్రామంలో విశాఖపట్నం నవనిర్మాణ సమితి స్వచ్ఛంద సేవాసంస్థ సౌజన్యంతో రూ.ఐదు లక్షలతో నిర్మించిన గ్రావిటీ పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.గ్రామంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నవనిర్మాణ సంస్థ మేనేజర్ సత్యనారాయణ స్పందించి, కిరంబో గ్రామాన్ని సందర్శించారు. గ్రావిటీ పథకానికి నిధులు మంజూరు చేశారు. గ్రామస్తులంతా శ్రమదానంతో గ్రావిటీ నిర్మాణ పనులకు సహకరించి పూర్తి చేశారు. శుక్రవారం గ్రావిటీ నీటిపథకం కుళాయిలను ప్రారంభించి, స్థానికులకు తాగునీరు అందించారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యుడు కొర్ర శంకరరావు మాట్లాడుతూ కిరంబోలో తాగునీటిఎద్దడిపై ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో నవనిర్మాణసమితి స్వచ్ఛంద సంస్థ నిధులు కేటాయించి గ్రావిటీ పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గిరిజనుల సమస్యలన్నీ పరిష్కరించేస్తున్నామని బూటకపు హామీలిచ్చిన నేతలు అమలు చేయని పరిస్థితుల్లో స్వచ్ఛందసంస్థలు గిరిజనం సమస్యలపై స్పందించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు భీమన్న, వాలంటీరు కె.బేసు, పి సీతారామ్, పి రఘు, పి సహదేవ్, కెభాస్కర్, రాజు, పి.కృష్ణ పాల్గొన్నారు.










