Oct 30,2023 22:53

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం విశాఖ, కడప ఉక్కు ప్యాక్టరీల పరిరక్షణ కోసం నవంబర్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ను చేపడుతున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌ నాయకులు వెల్లడించారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాల యంలో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌, పిడిఎస్‌యు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్‌కుమార్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తాం, ఛత్తీస్‌ ఘడ్‌లో మాత్రం ప్రయివేటీకరణ వ్యతిరేకం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ద్వంద వైఖరిను ఖండిస్తున్నట్లు చెప్పారు. 32 మంది విద్యార్థి, యువజను ప్రాణ త్యాగాలతో స్థాపించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలను కోవడం దారుణమన్నారు. కేంద్రప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మికులు అనేక ఉద్యమాలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనానరు. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నవంబర్‌ 8 నాటికి 1000 రోజులు అవుతుందని, ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడంతోపాటు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు భాను ప్రసాద్‌, దినేష్‌, రోహిత్‌, తదితరులు పాల్గొన్నారు.