
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలను వివరించేందుకు ఈ ఏడాది నవంబర్ 6 నుంచి సిపిఐ ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పడు వస్తాయా? ఈ అరాచక పాలన ఎప్పుడు పోతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. దశల వారి మద్యనిషేధం చెప్పిన సిఎం ఈ నాలుగున్నరేళ్ల పాలనలో మద్యం మాఫియా ద్వారా పాలన సాగించారని విమర్శంచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లేందుకు 15 రోజులపాటు ప్రతి వార్డులో ప్రతి వ్యక్తిని కలవాలని సూచించారు. ఈ సమావేశంలో జట్లు సంఘం అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ పాల్గొన్నారు.