
ప్రజాశక్తి-మధురవాడ : భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగానికి అనుబంధంగా ఉన్న సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చి బోర్డు (సెర్బ్), ఇండియన్ నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ సంయుక్తంగా జాతీయ స్థాయి యువ సమ్మేళనం ''యూత్ కాన్‌క్లేవ్ -2023''ని ఈ ఏడాది నవంబర్ 3, 4 తేదీలలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం మాట్లాడుతూ, యువతలో నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ యువ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. గీతం రీసెర్చి డెవలప్‌మెంట్ సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ రాజాపప్పు మాట్లాడుతూ, ''ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ గ్లోబల్ ఛాలెంజస్'' పేరుతో జరుగుతున్న ఈ యువ సమ్మేళనంలో పరిశోధకులు, యువ ఇంజినీర్లు, స్టార్టప్‌పై ఆసక్తి గల యువత జాతీయ స్థాయిలో పాల్గొనున్నారని తెలిపారు. ఐడియా థాన్, స్టార్టప్‌ల ప్రదర్శన, నమూనా ఇంజినీరింగ్ ప్రాజెక్టులను ప్రదర్శించడం, పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఈ యువ సమ్మేళనంలో ఆరోగ్యరంగం, అంతరిక్షం, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్‌సిటీ అర్బన్‌ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై నిర్వహించే పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేస్తామన్నారు. మహిళలకు ప్రత్యేక అవార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనానికి హజరు కాదలచిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా తమ పేర్లును నమోదు చేయించుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం షషష.ఱఅaవ.స్త్రఱ్aఎ.వసబ ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరణ్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగేంద్రప్రసాద్, డీన్ ప్రొఫెసర్ విజయశేఖర్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.