Oct 08,2023 17:45

నవజీవన్ బదిరుల ప్రత్యేక పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేస్తున్న నంద్యాల లయన్స్ క్లబ్.

నవజీవన్ బదిరుల పాఠశాలకు లయన్స్ క్లబ్ క్రీడా పరికరాలు
ప్రజాశక్తి - నంద్యాల

      నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బదిరుల పాఠశాలకు అంతర్జాతీయ లయన్స్ సేవా దినోత్సవం పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సభ్యులు పోసిన సుబ్బారావు, అవ్వారు గౌరీనాథ్ ల సౌజన్యంతో క్రీడా పరికరాలు అందజేశారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పీవీ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. జి. రవికృష్ణ , నవజీవన్ బదిరుల పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ మర్రెడ్డి, సిస్టర్ తంగం, లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేశుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బదిర విద్యార్థులు తమ లోపాన్ని అధిగమించి క్రమశిక్షణతో, అంకితభావంతో, పట్టుదలతో కృషి చేస్తే గొప్ప వ్యక్తులు కావడానికి అవకాశం ఉందని, ఆ దిశలో విద్యార్థులు ముందుకు వెళ్లాలని అందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలబడతాయని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు ఐఎంఏ హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. నవజీవన్ పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో,నృత్యంలో మంచి ప్రావీణ్యం కలిగిన వారు ఉన్నారని అదేవిధంగా క్రీడల్లో కూడా బాగా రాణిస్తున్నారని అభినందించారు. ఫాదర్ మర్రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. నవజీవన్ పాఠశాలకు లయన్స్ క్లబ్ కు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, సోమేశుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకు  తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యుడు మేడం చంద్రశేఖర్ బిస్కెట్ ప్యాకెట్లు, చిక్కి ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, నిర్వాహకులు భాస్కర్, రాజశేఖర్ ఇతర అధ్యాపక బృందం 150 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.