ప్రజాశక్తి-చీరాల: ఒంగోలులో జరిగిన ఘటనలో సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గిరిజన యువకుడు నవీన్‌ను గాయపరిచి అతడిపై మూత్రం పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ దుర్నీతిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మాల భేరి జాతీయ యువజన అధ్యక్షులు చప్పిడి ప్రియతమ్ ఆధ్వర్యంలో ఎన్జీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అవమానాలు జరుగుతున్నా జగన్ సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీని పెట్టి కంటి తుడుపు చర్యలు చేస్తున్నాడని విమర్శించారు. నవీన్ కేసులో సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప పోలీసులు స్పందించలేదంటే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నవీన్ కేసులో ఆరుగురు దోషులు ఉండగా ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి.. ఇంకా ముగ్గురు దొరకలేదు, పరారీలోనే ఉన్నారని చెప్పడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని జూలియన్ ఆరోపించారు. ప్రతిపక్షాలపై అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు తక్షణమే జైలుకు పంపించే పోలీసులు సామాన్య దళితులపై జరిగిన దాడులలో నిర్లక్ష్యం వహించడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడం లేదని అన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 20 వేల ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జగన్‌కు దళితుల మీద నిజంగా ప్రేమంటే తక్షణమే స్టేట్ మానిటరింగ్ కమిటీ ద్వారా ఎస్పీ, కలెక్టర్ దగ్గర రిపోర్టు తెచ్చుకొని కేసులపై రివ్యూ చేసి నవీన్ మీద జరిగిన దాడులు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గూడూరు కిషోర్, గరిక మోహన్‌రావు, పెర్లి సురేష్, గేరాబాబు తదితరులు పాల్గొన్నారు.










