Mar 16,2023 20:01

పొలంలో విత్తనాలు వేస్తున్న దృశ్యం

నవధాన్య విత్తనాల సాగు చేసుకోవాలి
ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి నరేంద్ర రెడ్డి

ప్రజాశక్తి - కొత్తపల్లి

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు నవధాన్య విత్తనాల సాగు చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి నరేంద్ర రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పాలెం చెరువు గ్రామంలో నవధాన్యాల విత్తనాల సాగులో భాగంగా రైతు రాజు నాయక్‌ పొలంలో 30 రకాల విత్తనాలతో విత్తన గుళికలు వేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పొలాల్లో పలు రకాల పంటలు వేయడంతో పాటు పంటల మార్పిడి కూడా చేసుకోవాలన్నారు. అలాగే 30 రకాల విత్తనాలు వేయటం వల్ల నేల సారవంతం అవుతుందని రైతులకు తెలిపారు. ఈ విధానం వల్ల భూమికి కావలసిన పోషకాలు అందుతాయన్నారు. అలాగే ఎండ కాలంలో ఎండ నేరుగా భూమిని తగలటం వల్ల భూమిలో సూక్ష్మ జీవులు చనిపోకుండ ఉంటాయన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతోపాటు జీవ వైవిధ్యం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఎండా కాలంలో నవధాన్యాలు వేయటం వల్ల నేలలో పోషకాలు పెరిగి ఖరీఫ్‌లో వేసే పంటలు మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. కనీసం 5 మంది రైతులతో విత్తన గుళికలు చేసి వేపించాలని తెలిపారు. అలాగే విత్తన గుళికలు చేసి విత్తనాలు వేయటం వల్ల విత్తనం వర్షం పడినప్పుడు విత్తనం మొలకెత్తే సామర్థ్యం వస్తుందని అలాగే విత్తనం చెడి పోకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి పీఎం సలాం, ఏఈఓ వెంకట నారాయణ, విఏఏ జహిద్‌ బాషా, ఎస్‌ఆర్పి నరేంద్ర గౌడ్‌, ఎంటి సయ్యద్‌ బాషా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.