Apr 11,2021 13:30

   గుమ్మానికి లోపలి వైపు నుంచి కాలేజ్‌కి వెళ్లిన తన కొడుకు, కూతురు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తోంది రత్నమ్మ.
'రోజూ ఇదే తంతు, వాళ్లేం చిన్న పిల్లలు కాదులేవే, వచ్చేస్తారు' అంటూ మేకపోతు గాంభీర్యంతో భార్యకు ధైర్యం చెప్పాడు రాఘవయ్య.
ఎందుకో ఇంత వయసొచ్చినా వాళ్ళింకా చిన్న పిల్లల్లానే కనపడతారు. ఎప్పుడూ ఒకరిని విడిచి మరొకరు ఉండని కుటుంబం వారిది. ఎక్కడికి వెళ్లినా అందరూ వెళ్లవలసిందే. లేకుంటే అందరూ ఇంట్లోనే. చిన్న ఉద్యోగంతోనే ఆయన కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా జరుపుకొస్తున్నారు.
   పిడికిలి గుప్పిట మూసినట్లు ఉంటుంది వారి విషయాలు. చన్నీళ్లకు వేన్నీళ్ళు తోడైనట్లు రత్నమ్మ విస్తారాకులు కుట్టి, చిల్లర ఖర్చులు సరిపెట్టేది. పిల్లలు పెరిగి, పెద్దయ్యే కొద్దీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
రాజేష్‌ కాలేజీలో అడుగుపెట్టగానే, అప్పటివరకూ పెరిగిన వాసనలు ఒక్కటిగా ఆవిరైపోసాగాయి. ఇంట్లో అవసరానికి ఒకేఒక్క ఫోన్‌ ఉండేది. ఇప్పుడు అమ్మానాన్నలను ఎదిరించి మరీ టచ్‌ ఫోన్‌ కొనుక్కున్నాడు. ఒక్క నిమిషమూ దాన్ని వదలడం లేదు. గేములు, పాటలు అంటూ పీకల్లోతు బురదలోకి కూరుకుపోయాడు. ఇక అది చాలదన్నట్టు కొత్త బైక్‌ వాళ్ళ నాన్నచేత అప్పు చేయించి మరీ కొనుక్కున్నాడు. దానిపై అతను వెళ్లే వేగం అతని వయసుకు అద్దం పడుతోంది. ఇక అమ్మాయి రేఖ స్నేహితులతో కలిసి తన వస్త్రధారణ మొత్తాన్ని మార్చేసింది. ప్రతిరోజూ ఇంటికి చేరుకోవడం ఆలస్యమే. ఎందుకని అడిగితే కస్సుమని అరుపులు, కేకలతో ఇల్లంతా గందరగోళంగా మారిపోయేది. ఇదంతా ఎలా మార్చాలో తెలియక గడపనే దైవంగా భావించి, వాళ్ళను త్వరగా చేర్చమని కళ్ళతో మొక్కుతూ కూర్చుంటుంది.
ఉన్నట్టుండి గబగబా ఇంటికి వచ్చిన రాఘవయ్య 'రత్నా కొంచెం ఆ బీరువాలో ఉండే డబ్బు తీసుకొనిరా పోదాం.. పని ఉంది' అంటూ ఉన్నఫళంగా ఉరుకులు పరుగులు తీస్తూ తన పాతబండిపై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ముందు నిలబడగానే రత్నమ్మ గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. లోపలికి వెళ్ళి ఒకగది తలుపు తీయగానే, మంచంపై కొడుకు రక్త గాయాలతో కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. ఒకవైపు చేతికి సెలైన్లు, సూదులు వేస్తూ చుట్టూ ఇద్దరు నర్సులు అక్కడే ఉన్నారు. పరుగులు తీస్తూ మంచం దగ్గరకు చేరుకున్న ఇద్దరూ ప్రమాదంలో కొడుకు తలకు తీవ్రగాయమైందనీ, రక్తం ఎక్కువగా పోవడం వల్ల వెంటనే రక్తం ఎక్కించాలని అన్నారు డాక్టర్లు.
వెంటనే రేఖకు ఫోన్‌ చేశారు. ఎందుకంటే వారిద్దరిదీ ఒకటే బ్లడ్‌ గ్రూపు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఫోన్‌ సిగెల్‌ అందటం లేదు. ఒకవైపు కొడుకు మంచంపై నిస్సహాయ స్థితిలో, మరోవైపు సమాచారం అందించలేనంత దూరంలో కూతురు. పరిస్థితి తలచుకుంటుంటే వారి కన్నుల్లో ఆకాశగంగ ఉబికి వస్తున్నది. వెంటనే ఒక చేయి భుజంపై పడటంతో రాఘవయ్య వెనుకకు చూడగానే.. తనతో పాటూ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ అక్కడ ఉన్నారు.
'నీ కొడుక్కి ఏమీ కాదు. ఇప్పుడే మన ప్రసాదు, రవి రక్తం ఇవ్వడానికి లోపలకి వెళ్లారు. మేము డాక్టర్‌తోనూ మాట్లాడాం. ఆయన ఏమి కాదని మాకందరికీ మాట ఇచ్చారు' అంటూ మూకుమ్మడిగా వారు పలికే ఆ మాటలు ఆశీర్వాదంలాగా వినిపించసాగాయి. ఇద్దరికీ కొండంత ధైర్యం కట్టగట్టుకొచ్చినట్లైంది.
కొద్ది సేపటికి రేఖ సమాచారం అందుకొని, హాస్పిటల్‌కు వచ్చింది. రాజేష్‌కు సృహ వచ్చింది. పిల్లలు ఇద్దరూ తమ తల్లితండ్రి దగ్గర కూర్చొని 'మిమ్మల్ని ఇప్పటివరకూ చాలా ఇబ్బంది పెట్టాం. ఇకపై మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మాకు బుద్ధి వచ్చేలా మీ మౌనమే సమాధానం చెప్పింది. మేము చేసిన పనులకు మీరు కాబట్టి మాటలతో చెప్పారు. 'అదే మీ స్థానంలో మేము ఉంటే ఈ పాటికి కాళ్ళు, చేతులు విరగగొట్టేవాళ్లం. ఇవన్నీ మేము మాటల్లో కాక చేతల్లో చేసి చెబుతాం' అంటూ వారన్న మాటలు కోకిల పాటలాగా, సన్నాయి మేళంలా, వేప చిగురులా, తీపి బెల్లం పానకంలా వినపడసాగాయి. పిల్లల మాటలతో వారికి ఒక నవ ''వసంతం'' ప్రారంభమైనట్లుంది. సింగంపల్లి శేష

సాయికుమార్‌
86396 35907