May 29,2022 09:55

దూరంగా..
నాగరికతకు స్వాగతం
పలికే సమాజం
కనుచూపుకు నోచుకొని చోట,
అగ్గి రాజుకుంటుంది.
నిప్పు కణంతో కాదు
నిరక్షరాస్యత
నేర్పించిన వేలిముద్రలు
చెరుపుకుంటూ..
తరతరాలుగా
దొరలకు ఊడిగం చేసిన చేతులు
మట్టి పలకలు
చేతపట్టి..
బలపంతో సంతకం నేర్చిన
గిరిజన తండాల్లోని..
పేదవాని స్వరం రగిల్చిన
చైతన్యపు బావుటా జ్వాలే అది.
గుంట నక్కలు, తోడేల్లు
కలుగుల్లో మగ్గిపోతున్నారు.

నిగ్గదీసే స్వర ప్రతిధ్వని తాళలేక.
గిరిపుత్రుడు
ప్రశ్నించడం నేర్చాడు
అతని గొంతుక
నిలదీయడం నేర్చుకుంటుంది..
అతని చూపుడు వేలు
గురిపెట్టడం నేర్చుకుంటుంది.
అతని పాదం
మరికొందరికి
మార్గం చూపుతుంది
గిరిజన తండాల్లో నవశకం.ఆరంభమైంది.
తమని తామే సరిదిద్దుకునే
దిశ వైపు.
 

రాము కోలా
9849001201