Jun 12,2022 13:45

ఆరు.. నాలుగు.. మూడు.. రెండు.. మూడు.. నాలుగు.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లలో ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ లఘు పరీక్షలో ఇరవైకి వరుణ్‌కి వచ్చిన మార్కులు.
టీచర్లు తల్లిదండ్రుల సంతకాలు పెట్టించుకుని రమ్మని ఆన్సర్‌ షీట్‌లను ఇళ్లకు పంపించారు.
వరుణ్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. తెలివైన పిల్లవాడు. మనసుపెట్టి చదివితే మంచి మార్కులు తెచ్చుకోగలడు. కానీ చదవాలంటే బద్దకం.. ఎప్పుడూ ఆటలు.. ఆటలు..
''అమ్మా.. ప్లీజ్‌.. ఈ ఒక్కసారికి.. ఇంక బాగా చదువుతాను మా అమ్మవు కదూ..'' కూరగాయల తరుగుతున్న వసంత గడ్డం పట్టుకుని బతిమిలాడుతున్నాడు. బిడ్డ గడ్డం పట్టుకొని బతిమలాడుతుంటే ఆమెకు ఏడుపొచ్చినంత పనైంది. ఒక్క నిమిషం కూరగాయలు తరగడం ఆపి, గమ్ముగా ఉండిపోయింది.
ఆ మధ్య వరుణ్‌ విషయంలో తనకి, భర్తకి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
'ఒక్కగానొక్క నలుసని ముదిగారం కారిస్తే ఎందుకూ కాకుండా పోతాడు.. బిడ్డని తిండికాడ ముద్దు చెయ్యెచ్చేమో గానీ చదువు కాడ కాదు' అని భర్త వసంతని మందలించాడు. దానికి తను 'చదువుతాడులే.. మనకు నూరారు మంది లేరు. ఒక్కడే కదా.. మనిద్దరం సంపాదించి పెడితే చాలదా?' అంది.
'ఎప్పుడూ ఇలాగే ముసలోళ్లం కాకుండా ఉండడానికి మనమేమైనా దేవతలమా? తోటమాలి కూడా మొక్కలకే నీళ్లు పడతాడు మానులకి కాదు. మొక్క పెరిగే కొద్దీ నీళ్లు తగ్గించాలి.. అప్పుడే అది నీళ్ల కోసం చేసే ప్రయత్నంలో వేళ్ల ద్వారా దారులు వెతుక్కుంటుంది. తగినంత నీళ్లు పట్టిస్తుంటే ప్రయత్నం చేయక ప్రతిరోజూ తోటమాలి కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. మొక్కకైతే ఒక బక్కెట్‌ నీళ్లు సరిపోతాయి. అదే మానుకైతే ఎన్ని నీళ్లు పట్టాలి?. పట్టి దాన్ని సంతృప్తి పరచగలమా?' ఆ మధ్య టీవీలో విన్న మాటలు చెప్పాడు. భర్త మాటలు నిజమేననిపించి, ఆలోచనలో పడింది వసంత.
'అమ్మా.. అమ్మా..' కుదిపే సరికి కొడుకు వైపు చూసి 'వరూ.. ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావో తెలుసా? ఎన్నిసార్లు ఒట్టేశావో గుర్తుందా? మీ నాన్న నన్ను తిడుతున్నాడు. నీ ముదిగారం వల్లే వాడిట్టా తయారవుతున్నాడని. అందుకే మీ నాన్న దగ్గరే సంతకం పెట్టించుకో!' అంటూ తరిగిన కూరగాయలు తీసుకొని లేచింది.
అమ్మ సంతకం పెట్టలేదని ఏడుస్తూ.. ఏడుస్తూనే నిద్ర పోయాడు వరుణ్‌. పనిలో నుంచి ఇంటికి వచ్చిన వాసు, నిద్ర పోతున్న కొడుకుని చూసి 'ఏంటి వీడు అప్పుడే నిద్రపోయాడు' అని వసంతని అడిగాడు, టేబుల్‌ మీద పకోడి పొట్లాన్ని పెడుతూ.
 విషయం చెప్పి, వాసు చేతికి నీళ్ల గ్లాసు అందించింది వసంత. నీళ్లు తాగి గతాన్ని నెమరేసుకున్నాడు వాసు.
                                                   **********************************
తను ఒకటో తరగతిలో చేరిన రోజు.. మొదటిసారి బడికి వెళుతున్న రోజు.. వాసు వాళ్ల అమ్మ వాసు మొహానికి పాండ్స్‌ పౌడర్‌ పూసి, రెండు బుగ్గలనూ నిమిరి తన కణతలకి చేతులు ఆనించుకుని మెటికలు పళక్కని విరిచి 'నా బంగారు కొడుకు కలకటేరు కావాల..' అని దీవిస్తూ ముద్దు పెట్టుకుని, చంకనెత్తుకుని బడిలో చేర్పించిన రోజు.
కొత్త చొక్కా.. మోకాళ్ల దాక నిక్కరు.. ఎడమ చంకలో పెద్ద రబ్బరు పలక.. చొక్కా జేబులో బలపం కోపు. దాన్ని అప్పుడప్పుడూ తడుముకుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంది. ఎంత ఆనందమో.. భలే తమాషాగా ఉంది.
మూడో తరగతిలో ఒకరోజు టీచర్‌ బ్లాక్‌ బోర్డు పక్కన ఉన్న మేకుకి తగిలించి ఉన్న వర్ణమాల చార్ట్‌ను చూపించిద పిల్లల చేత చదివిస్తూ వాసుని పిలిచింది. వాసు 'అ' నుంచి 'క్ష' వరకూ తప్పుల్లేకుండా చదివేసి చేతులు కట్టుకుని టీచర్‌ వైపు చూశాడు, మెప్పు కోసం. ''వాసూ.. గుడ్‌ బాగా చెప్పావ్‌'' టీచర్‌ అనేసరికి వాసుకి సిగ్గేసి, మెలికలు తిరిగాడు.
వాసు చదవడానికి ఐతే బాగానే చదివాడు. కానీ అక్షరాలు చూసీ చూడకుండా చదివినట్లు అనిపించింది.. బట్టీ పట్టి చెప్పినట్లు అనిపించింది. అందుకే, 'వాసూ.. ఇప్పుడు చివరి నుంచి అంటే 'క్ష' నుంచి వెనక్కి చదువు' అంది.
చేతిలో ఉన్న కర్రని 'క్ష' మీద కర్ర పెట్టి కొంతసేపు ఏదేదో ఆలోచించి 'క్ష' చెప్పాడు. ఓ అర నిమిషం తర్వాత 'హ' చెప్పాడు. ఇంకో ఆర నిముషం తర్వాత ఇంకో అక్షరం.. ఇలా ఆలోచించి, ఆలోచించి చెబుతున్నాడు.
టీచర్‌కి విషయం అర్థమయ్యింది. తను ఊహించింది కరెక్టే ప్రతి అక్షరాన్ని చెప్పేటప్పుడు మొదటి నుంచి అంటే 'అ' నుంచి చెప్పుకుంటూ వచ్చి అప్పుడు చెప్పాల్సిన అక్షరాన్ని పైకి గట్టిగా చెబుతున్నాడు.
ఒకటో తరగతి టీచర్‌ ఎప్పుడూ ఇలా చివరి నుంచి మొదటికి చెప్పనూ లేదు. చెప్పించనూ లేదు. ఎప్పుడూ 'అ' నుంచి చెప్పేది.. అదే మాట అన్నాడు. 'టీచర్‌.. మా టీచర్‌ వెనక నుంచి ఎప్పుడూ చెప్పలేదు. ముందు నుంచే చెప్పించేది' అన్నాడు వాసు.
'సరే.. సరే.. ఫరవాలేదులే. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఎలాగైనా చెప్పాలి. ఇంకా ఎక్కడ అడిగినా చెప్పగలగాలి. అప్పుడే మనకు అక్షరాలు బాగా వచ్చినట్టు. ఇంటి దగ్గర బాగా చదువుకోండి. రేపు అందరనీ అడుగుతాను' అని టీచర్‌ చెబుతుండగానే గంట మోగింది.
తర్వాత రోజు ఉదయం వాసు కడుపునొప్పి అని ఏడుస్తుంటే 'ఒరే వాసు.. నాము కొమ్ము సాది.. బొడ్డు చుట్టూ పూస్తే కడుపునొప్పి తగ్గిపోతాదిలే' అని చెప్పి నాము కొమ్ము సాది పొట్ట మీద గుండ్రంగా, మందంగా పూసి, పెరట్లో వేప చెట్టు కింద నులక మంచం వేసి, పడుకోబెట్టి.. ఇంట్లోకి, బయటికి తిరుగుతూ పని చేసుకుంటూ ఉంది వాసు వాళ్ల అమ్మ వరలక్ష్మి. అమ్మ బయటకు వస్తున్నప్పుడు, తను పడుకున్న మంచానికి దగ్గరగా పోతున్నప్పుడు మూలగడం.. ఇంట్లోకి వెళ్లగానే గమ్ముగా ఉండటం. వాడి మూలుగులు ఎలా ఉన్నాయంటే సిలోన్‌ రేడియోలో పాటల ప్రోగ్రాం వచ్చినట్లు.. ఒక్కోసారి బిగ్గరగా ఒక్కోసారి మెల్లగా.. ఇలా స్కూల్‌ టైం అయ్యే వరకూ సాగదీశాడు. టైం గడిచే కొద్దీ కొద్దికొద్దిగా మూలుగులు తగ్గించి, నిద్రపోతున్నట్లు కళ్లుమూసుకుని, అప్పుడప్పుడు వాళ్లమ్మ ఎక్కడుందో చిన్నగా కళ్లు తెరిచి చూస్తున్నాడు. వరలక్ష్మి తడి చేతిని పైట కొంగుకు తుడుచుకుంటూ 'నాయనా వాసా.. అంగటికి పొయ్యొస్తా ఇంట్లోకి కుక్కలు దూరతాయేమో చూస్తా ఉండు' అంటూ వీధిలోకి వెళ్లింది. సందుకోసం సందులో ఎదురుచూస్తున్న వినరు పరిగెత్తుకుంటూ వాసు మంచం కాడికి వచ్చి 'ఒరేరు నేను గుడికాడ ఉంటా.. గభాలన వచ్చెరు' అని ఆదరాబాదరాగా చెప్పి, తుర్రుమన్నాడు.
వరలక్ష్మి ఇంటికొచ్చాక వాసు దగ్గరకొచ్చి.. పొట్టని తడిమి చూసింది. మెల్లగా ఒత్తి ఒత్తి చూస్తూ ''ఇప్పుడెట్టుంది నాయనా? అని అడిగింది.
'కొంచెం తగ్గింది మా..' అన్నాడు వాసు.
'సరే వీదిలోకి పోయి, కొంచేపు ఆడుకొని రాబో నెప్పి తగ్గిపోతాది' అని వరలక్ష్మి అనేసరికి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాసు తల్లికి ఉత్సాహాన్ని కనిపించనీయకుండా 'సరే మా' అంటూ లేచి, మెల్లగా వీధిలో నడిచాడు.
మరుసటి రోజు వరలక్ష్మి బోర్‌ కాడ నుంచి నీళ్ల బిందె చంకనేసుకొని వస్తూ ఉంటే.. వాసు చెడ్డీ బొత్తాలు విప్పుకుంటూ వాళ్ల ఇంటికి కాస్త దూరంగా ఉన్న కంపచెట్లలోకి పరిగెత్తాడు. వాడు పొద్దుట్నుంచీ ఇలా పరిగెత్తడం ఇది మూడోసారి. తిరిగొచ్చాక 'ఏంది నాయనా అన్నిసార్లు పోతా ఉండావు' అని అడిగింది వరలక్ష్మి.
'ఊరికూరికే దొడ్డికి వస్తా ఉండాది మా' నీరసాన్ని నటిస్తూ అన్నాడు.
నిన్న కడుపునొప్పి అన్నాడు. ఈ రోజు ఇట్టా అంటా ఉండాడు. కడుపులో నులి పురుగులేవైనా.. అని అనుకుంటూ 'యాడ కుచ్చున్నావో సూపిద్దువు పా' అని ఆమె అనేసరికి వాసుకి గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది.
ఈ రోజు కూడా వాసుకి బడికి పోవాలని లేదు. ఈ రోజు కడుపునొప్పి అని చెబితే అమ్మ నమ్మదేమో అని ఈ ఉపాయం ఆలోచించాడు. కానీ ఇది బెడిసికొట్టేలా ఉంది. ఏం చేయాలి? కంపచెట్ల కాడికి వెళ్లాక ఆ పక్క ఈ పక్క చూసి ఎక్కడ కూర్చున్నానో గుర్తులేదు మా' అన్నాడు. వరలక్ష్మికి విషయం అర్థమైంది.
వాసు వాళ్ల నాన్న వచ్చాక చెప్పింది. అతను వాసుని చంకలోకి ఎత్తుకొని నడుస్తూ 'ఒరే వాసా.. బాగా చదువుకోవాల.. నువ్వు నాలా కూలిపనికి పోగూడదు.. నాలుగు ముక్కలు నేర్చుకున్నావంటే నాలాగా ఎండలో ఎండిపోకుండ నీడ పాటన బతకొచ్చు.. సరేనా! మా నాయన నన్ను సదూకోరా కొడకా.. సదూకోరా కొడకా.. అని సెప్పితే నేనినలా.. ఇట్టా వుండా' అంటూ గడ్డం పట్టుకుని చెప్పాడు. ముద్దు పెట్టుకుని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పాడు. స్కూల్‌ ముందు జాంకాయలు అమ్మే ముసలావిడ దగ్గర రెండు జామకాయలు కొనిచ్చి, స్కూల్లో వదిలేసి వెళ్లాడు.
మేడం ఈరోజు వర్ణమాల చార్టులో ఎక్కడ అడిగితే అక్కడ నుంచి చదవాలని చెప్పింది. చెప్పకపోతే కొడుతుందేమో!
వాసు పక్కన కూర్చున్న వినరు చెవిలో గుసగుసగా పాస్‌కి పోదామా అన్నాడు. దానికి వినరు కొద్దిసేపు ఆలోచించి 'నాకు పాసు రావడం లేదురా' అన్నాడు.
'రాకపోతే ఏం కాదులే ఉబ్బెత్తుగా ఉన్న తన చెడ్డీ జేబుని కళ్లతో సైగ చేసి చూపిస్తూ ఎడమచేతిని పొట్ట మీదగా అడ్డంపెట్టుకుని దానికి తాకుతున్నట్లు కుడి చేతిని నిలువుగా ఉంచి నాలుగువేళ్లు మడిచి చిటికెన వేలు పైకి ఎత్తి 'టీచర్‌...' అన్నాడు. వినరు కూడా చిటికిన వేలు పైకి ఎత్తి నిలుచున్నాడు. మిడ్‌ డే మీల్‌ రిజిస్టర్‌ రాసుకుంటున్న టీచర్‌ వీళ్ల వైపు చూసి, తల అడ్డంగా ఊపింది. అయినా వాళ్లు చిటికెన వేళ్లను ముడవనూ లేదు కూర్చోనూ లేదు. కుడి చేతిని మాత్రం నిలువుగా ఉంచి, ఎడమ చేతిని పాస్‌ పోసుకునే భాగం మీద ఉంచి అదుముకుంటూ 'టీచర్‌.. టీచర్‌' అని బతిమిలాడుతున్నాడు వాసు.
రిజిస్టర్‌లో నుంచి తల పైకెత్తి చూసి పంపించకపోతే ఇక్కడే పోసేస్తారేమో.. 'పోండి' అన్నట్లు తలూపింది టీచర్‌.
హమ్మయ్యా! ఈ రోజుకి బతికిపోయాం. బయటికి పరిగెత్తాడు వాసు. ఆ రోజు నుంచి వాళ్లిద్దరూ తరగతి గదిలో కంటే బయట ఎక్కువగా ఉంటున్నారు.
                                                     ********************************
పాస్‌ అవ్వడానికి మార్కులతో అవసరం లేకపోయే సరికి వాసుకి కూడా ఐదో తరగతి పాస్‌ అయినట్టు రికార్డ్‌ షీటు ఇచ్చి, హైస్కూల్లో చేర్చి శనగలు తిని చేయి కడుక్కున్నాడు ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు.
టీచర్లకు ఏదైనా అవసరమైనప్పుడు నోట్లో మాట నోట్లో ఉండగానే వాసు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యేవాడు. వాళ్లకి టిఫిన్‌ కావాలన్నా, తాగడానికి నీళ్లు కావాలన్నా.. ఏ పనైనా తనే పరిగెత్తుకొని వెళ్లేవాడు. స్కూల్‌లో అటెండర్‌ ఉన్నా, రిజిస్టర్లు తరగతులలో పెట్టడం నుంచి గంట కొట్టడం వరకూ అన్నింట్లోనూ వాసే. దీనికి కారణం ఉపాధ్యాయులు చేసుకు రమ్మన్న హోంవర్కు చేయకపోవడం.. నేర్చుకు రమ్మన్న పాఠాలు నేర్చుకోకపోవడం.
ఇంటర్‌ చదవాలంటే పదో తరగతి కచ్చితంగా పాస్‌ అయి ఉండాలి కదా. కానీ వాసుని ఒక సబ్జెక్టు కూడా కనికరించలేదు.
తన స్నేహితులు సైకిళ్ల మీద కాలేజీకి సూళ్లూరుపేటకి వెళ్తుంటే, తను సత్తు డబ్బాలో సద్ది అన్నంతో కూలి పనికి పోతున్నాడు. అలా పోతున్నప్పుడు చాలా అవమానంగా ఉండేది. తనని తాను చూసుకుని బాధపడేవాడు.
'అన్నం తిందువు రా!' అని వసంత పిలవడంతో ఆలోచనల నుంచి బయటకొచ్చాడు. వాసు కొడుకు వైపు చూశాడు. గుండెల మీద.. పక్కలో.. ఆన్సర్‌ షీట్‌లు.
దగ్గరికెళ్లి 'వరుణ్‌.. వరుణ్‌.. లే.. లే..' బుగ్గలమీద చేతితో మెల్లగా తట్టి లేపాడు వాసు. వరుణ్‌ ఉలిక్కిపడి లేచి ఏడవబోతుంటే, కొడుకు కళ్లు నీరు తుడుస్తూ 'ఎందుకేడుస్తన్నావు? అమ్మ అంతా చెప్పిందిలే. సంతకం నేను పెడతాలే.. అన్నం తిందాం రా..' అనునయంగా అన్నాడు వాసు.
తండ్రీకొడుకులు భోంచేస్తుంటే వసంత పక్కలు సర్దింది.
రోజూ వాసు ఒక మంచంలో, వసంత, వరుణ్‌ ఒక మంచంలో పడుకుంటారు. వరుణ్‌ తన మంచం కాడికి వెళుతుంటే, తనతో పాటు పడుకోమని వరుణ్‌ని పిలిచి, పక్కలో పడుకోబెట్టుకున్నాడు. కొడుకుని తనవైపుకు తిప్పుకుని, వరుణ్‌ నీకు ఒక కథ చెప్పనా అన్నాడు.
'ఊఉ..' అన్నాడు వరుణ్‌.
'ఒక తండ్రి తన కొడుక్కి చెప్పాడట.. 'నాయనా బాగా సదువుకోమని మాయమ్మా నాయినా సెప్పారు. మన సార్లు సెప్పారు. ఇనలా.. నేనిట్టా అయ్యా నువ్వు నాలా కష్టపడకూడదు మట్టి పిసుక్కోకూడదు అని'
ఆ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. తను తన కొడుకుతో 'నాయనా! బాగా చదువుకోమని మా అమ్మానాన్న చెప్పారు.. వినలేదు. మా టీచర్లు చెప్పారు.. వినలేదు. నేను ఇలా అయ్యా. నువ్వు నాలా కాకూడదు కూలి పని చేసుకోకూడదు' అని
ఆ కొడుకు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు అతనూ తన కొడుక్కి ఇలాగే చెప్పాడట ఇది మా తెలుగు సార్‌ చెప్పిన కథ. ఈ కథని ఆయన ప్రతి తరగతిలో చెబుతున్నారట.. ప్రతి సంవత్సరం చెబుతున్నారట.. మాకూ చెప్పారు. ఈ కథని నా బిడ్డకి చెప్పాను. నువ్వు నీ బిడ్డలకు ఈ కథ చెప్పే పరిస్థితి రాకూడదని నా ఆశ' అంటూ వరుణ్‌ ఆన్సర్‌ షీట్ల మీద సంతకం చేశాడు. వరుణ్‌ తండ్రి చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ తండ్రినే చూస్తున్నాడు.

                                                      దాసరి చంద్రయ్య 9440407381