ప్రజాశక్తి -రంపచోడవరం
మహాసభల స్ఫూర్తితో నూతనోత్తేజంతో అంగన్వాడీ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఎంపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబీ రాణి అన్నారు. స్థానిక యుటిఎఫ్ సమావేశ మందిరంలో గురువారం అంగన్వాడీ యూనియన్ రంపచోడవరం జిల్లా ప్రథమ మహాసభ యూనియన్ నాయకురాలు కె.రామలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బేబీరాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులు, చట్టాలను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిందని చెప్పారు. రాష్ట్రంలో కార్మిక సమస్యలపై ఆందోళ చేస్తున్న కార్మికులు, నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, నిర్బంధాలకు గురి చేస్తుందని తెలిపారు. జిల్లాల విభజన సరిగా జరగకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సున్నం రంగమ్మ, బత్తిన నిర్మల, కోశాధికారిగా కారం రామలక్ష్మి, ఉపాధ్యక్షులుగా పోడియం సావిత్రి, కొర్రపు రాణి, మడెం అన్నపూర్ణ, కళింకోట వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా బండారు సూర్యకుమారి, నడిపూడి రత్నకుమారి, ముసురు రాజేశ్వరి, మరో 17 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇ,చంద్రవతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పూనెం సత్యనారాయణ, కంభం శాంతిరాజు, పుట్ట రామరాజు, కొమరం చెల్లయమ్మ తదితరులు పాల్గొన్నారు.










