Jul 24,2021 19:53
మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు 'రైతు వ్యతిరేక చట్టాలు ా వ్యవసాయం, ప్రజలపై ప్రభావాలు' అనే అంశంపై ఆగస్టు 29, 30 తేదీల్లో గుంటూరులో జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరులోని పిఎల్‌రావు భవన్‌లో ఆహ్వాన సంఘం సమావేశం శనివారం ఆ సంఘం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఉద్యమం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ నల్ల చట్టాల వల్ల భవిష్యత్‌లో వ్యవసాయం మరింత దివాళా తీస్తుందన్నారు. కౌలు రైతులు, పేద రైతులు తీవ్రంగా నష్టపోతారని, వ్యవసాయానికి దూరమవుతారని తెలిపారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల దుష్ప్రభావాన్ని రైతులు మరింత తెలుసుకోవాలన్నారు. జగన్‌ ప్రభుత్వం కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన చట్టం వల్ల వారికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. జిల్లాలో 2.60 లక్షల మంది కౌలు రైతులుంటే 33 వేల మందికే రుణార్హత కార్డులు, 10 వేల మందికే రుణాలు ఇచ్చారని తెలిపారు. ఎన్‌జి రంగా యూనివర్సిటీ రిటైర్డ్‌ డీన్‌ ఆర్‌.వీరరాఘవయ్య మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల ఫలితంగా మార్కెట్‌ నుంచి ప్రభుత్వం వైదొలిగితే కౌలు రైతులు, పేద రైతులకు తీవ్ర నష్టమన్నారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు, ఎన్‌జి రంగా యూనివర్సిటీ రిటైర్డ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌.అంకయ్య తదితరులు పాల్గన్నారు.

ఆహ్వాన సంఘం ఏర్పాటు
జాతీయ సెమినార్‌ సన్నాహక సమావేశం అనంతరం ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షులుగా, ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు ఉపాధ్యక్షులుగా, ఆర్‌.వీరరాఘవయ్య సలహాదారులుగా, వి.చెంగారెడ్డి, ఆర్‌.అంకయ్య, పి.సుబ్బరామిరెడ్డి, రైతు, ప్రజాసంఘాల నాయకులతో ఆహ్వాన సంఘం ఏర్పాటైంది.