ప్రజాశక్తి-పంగులూరు: పంటలకు వచ్చే చీడపీడల దృష్ట్యా వాటిని తట్టుకొని నిలబడే నూతన వంగడాల వైపు ప్రస్తుతం రైతులు ఆసక్తిగా చూస్తున్నారని, నంద్యాల విత్తన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జయలక్ష్మి తెలిపారు. మండలంలోని చందలూరు గ్రామంలో, రెండు ఎకరాల్లో పరిశోధన కేంద్రం వారు కనుగొన్న నూతన శనగ వంగడాలను సాగు చేస్తున్నారు. ఈ పంటను శుక్రవారం నంద్యాల విత్తన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం పంటల్లో వస్తున్న చీడపీడలను తట్టుకొని ఉండే నూతన శనగ విత్తనాలు కనుగొన్నట్లు తెలిపారు. ఈ విత్తనాలు చందలూరు గ్రామంలో రెండు ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. శనగలో ప్రస్తుతం రబిలో వేసే జెజె విత్తనాలకు బదులు 440 రకం, బోర్డులకు బదులు 2003 రకం ప్రత్యామ్నాయంగా చూసినట్లు తెలిపారు. కొత్త రకం విత్తనాలు వేసిన ఎర్రమనేని వెంకట్రావుకు పంట బాగా పండినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీటక విభాగం పరిశోధకులు డాక్టర్ ముజుసాద్, తెగుళ్ల విభాగం పరిశోధకుడు డాక్టర్ చైతన్య, ప్లాంటేషన్ ఫీడ్ విభాగం పరిశోధకులు డాక్టర్ రమాదేవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.










