May 31,2023 23:36

స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో విసి, వర్సీటీ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు

జెఎన్‌టియుకె 9 వ స్నాతకోత్సవంలో రాష్ట్ర్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ : పలువురికి డాక్టరేట్లు ప్రదానం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
ఇంజినీరింగ్‌ విభాగంలో నిత్యం కొత్త మార్పులు ఎదురవుతాయని, వాటికి తగ్గట్టు సిద్ధమవుతూ పురోగతి సాధించాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సూచించారు. కాకినాడ జవహర్‌ లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన 9వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీ ఛాన్సలర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ రంగంలో దేశం అభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రపంచంలోనే మూడవ అత్యధికంగా 25 వేలమంది పీహెచ్‌డి స్కాలర్లున్న దేశం భారతదేశం అని అన్నారు. స్టార్టప్స్‌లో కూడా అమెరికా, చైనా తర్వత మనదే ఆధిక్యమని తెలిపారు. యూని కార్న్స్‌ లో కూడా ముందడుగు వేస్తున్నామని, ఇంజనీరింగ్‌లో పెట్టుబడులు కూడా పెద్ద స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. జెఎన్‌టియుకె న్యాక్‌ ఏ ప్లస్‌ గుర్తింపు వచ్చిందన్నారు. మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌, పద్మభూషణ్‌ సత్య ఎన్‌ అట్లూరి, బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి వంటి వారు ఇక్కడ విద్యనభ్యసించారన్నారు.క్రీడలకు కూడా ఈ యూనివర్సిటీ . 1946లో ప్రారంభమ యిన ఈ క్యాంపస్‌ ఇటీవలే ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకుందని తెలిపారు. తొలుత 100 మందితో మొదలయ్యి 2 లక్షల మంది విద్యార్థులు, 10వేల మంది ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీలో ఉండే స్థాయికి చేరిందన్నారు.
దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటిగా విద్యార్థుల్లో పరిపూర్ణత తీసుకొస్తుందన్నారు. కేవలం డిగ్రీ పట్టా మాత్రమే అందించడం కాకుండా సమాజ నిర్మాణానికి అవసరమైన రీతిలో వర్సిటీ సిద్ధం చేస్తోందని తెలిపారు. వర్సిటీ 9 వ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు, డాక్టరేట్లు అందజేసి వారిని గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు. వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జీవిఆర్‌ ప్రసాదరాజు మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పాటు అయినప్పటి నుండి దశల వారీగా ఎంతో సాంకేతిక నైపుణ్యత సాధించి, అంతర్జాతీయ ఖ్యాతి చెందిందనిఆయన వర్సిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. జెఎన్‌టియుకె పూర్వ విద్యార్థి శాంతా బయోటెక్‌ అధినేత డాక్టర్‌ కెఐ వరప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ స్వదేశీ టెక్నాలజీతో హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి చేయించి, ఉత్పత్తి చేసి 1997లో మార్కెట్లోకి తెచ్చి అతి స్వల్ప ధరకు సామాన్యుడికి అందించానని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉండే విధంగా సిఎం జగన్‌ కషి చేస్తున్నా రన్నారు. అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా భవిష్య త్తులో ముందుకు వెళతామన్నారు. డాక్టరేట్లు పొందిన విద్యార్థులు భవిష్య త్తులో ఉత్తమ పౌరులుగా తయారయ్యి సమాజానికి మేలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెక్టార్‌ కెవి రమణ, రిజిస్ట్రార్‌ సుమలత, ఒఎస్‌డి సిహెచ్‌ సాయిబాబులతో బాటు యునివర్సిటీ డైరెక్టర్లు, మంత్రులు పినిపే విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపి వంగా గీత, ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు, పెండెందొరబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్ర కళాదీప్తి పాల్గొన్నారు.
గవర్నర్‌ కు ఘన స్వాగతం
గన్నవరం విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌ ద్వారా కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌ కు చేరుకున్న గవర్నర్‌ కు హెలిప్యాడ్‌ వద్ద రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపి గీత, కలెక్టర్‌ కృతికాశుక్లా, తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం గవర్నర్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నుండి బయలుదేరి జెఎన్‌టియుకెకు చేరుకున్నారు.