ప్రజాశక్తి - కదిరి టౌన్ : నూతన విద్యావిధానంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆనర్స్ డిగ్రీతో ఐటీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బ్లూమూన్ విద్యాసంస్థలు అధినేత శివ శంకర్ పేర్కొన్నారు .కదిరి రూరల్ ఏర్రదొడ్డి గంగమ్మ వద్ద గల బ్లూమూన్ విద్యా సంస్థల ఆవరణంలో జూనియర్ కళాశాల ప్రెషర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలుపరిచిన జాతీయ విద్యా విధానంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ నూతనవిద్యా విధానం అమలుపరచినందున విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణిస్తారని తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు సాధిస్తారని అన్నారు. ఈ విద్యా విధానంపై విద్యార్థులు పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గతంలో నుంచే ఈ విద్యా విధానం అమల్లో ఉందన్నారు. ఆనర్స్ డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కోర్స్ పూర్తి చేస్తే దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చనని విదేశాల్లో సైతం సులువుగా ఉద్యోగ అవకాశాలు సాధించే అవకాశం ఉందని అన్నారు. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఆపేసిన విద్యార్థులకు డిప్లమా సర్టిఫికెట్ అందజేస్తారని దీంతో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. మూడవ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు గతంలో లాగే డిగ్రీ ఇవ్వబడుతుందన్నారు. నాలుగో సంవత్సరం కొనసాగితే ఆనర్స్ డిగ్రీ పట్టాను అందజేస్తారన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసి కళాశాలల నుంచి కొలువు దక్కేలా ప్రత్యేకంగా ఆనర్స్ కోర్సులకు రూపకల్పన చేశారన్నారు. ఐటీ, పారిశ్రామిక సంస్థలు,ఇతర డిమాండ్ ఉన్న రంగాల్లో మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు. క్రమశిక్షణతో చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు అన్ని రకాలుగా అండగా ఉండాలని సూచించారు. ముందుగా సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ రెడ్డి , అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు










