నూతన జాతీయ విద్యా విధానం-2020 (ఎన్‌ఇపి) ప్రతిపాదిస్తున్న...ఆన్‌లైన్ విధానం, దూర విద్యా విధానం, విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలనడం... ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగానూ, పోటీగానూ మారుతున్నాయి. విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని టెక్నాలజీ వినియోగం ద్వారా మార్కెట్‌ను ప్రోత్సహించే విధంగా మారుస్తున్నది.
పాఠశాల నిర్వహణ, పథకాల రూపకల్పన, సిలబస్, విధాన నిర్ణయాలలో ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని కుదించి, నిరాకరిస్తోంది. పైగా కేవలం ప్రభుత్వాలు చెప్పిన పని చేసేవారిగా మాత్రమే వారి పాత్రను పరిమితం చేస్తుంది. పై నుండి అనేక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ నిర్ణయించడం, ముందుగా నిర్ణయించిన శిక్షణలను రుద్దడం వంటి ప్రతిపాదనలు ఇందులో అనేకం వున్నాయి. తరగతి గదిలో విద్యార్థికి ఏం బోధించాలన్నా, విద్యార్థి నుండి ఎటువంటి ప్రతిభ రాబట్టాలన్నా ఉపాధ్యాయులకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి లేకుండా పోతుంది. పైనుండి ముందుగా నిర్ణయించిన వాటి బోధనే ప్రధానంగా వుంటుంది.
ఉపాధ్యాయ వృత్తిపరమైన శిక్షణకు 'కంటిన్యువస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్' ను (సిపిడి) ఏర్పాటు చేసి అందులో ప్రతి ఉపాధ్యాయుడూ సంవత్సరానికి 50 గంటలు శిక్షణ పొందాలని చెప్పింది. అయితే ఈ శిక్షణ కేవలం పార్ట్ టైం, సాయంత్రం వేళ ఆన్‌లైన్ ద్వారా జరపాలని చెప్పింది. అంటే ఈ ప్రతిపాదన కూడా నామమాత్రమైనదే. 1994 నుండి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో భాగంగా ఉపాధ్యాయ శిక్షణ సంవత్సరానికి 20 రోజులు పాటు అమలవుతున్నది. ఉపాధ్యాయ ఖాళీల సమస్యను ఎన్‌ఇపి గట్టిగా పట్టించుకున్నట్టులేదు. 2018-19 దేశవ్యాప్తంగా మంజూరైన పోస్టుల్లో 11.7 శాతం ఖాళీలున్నాయి. 'సమగ్ర శిక్ష' పరిధిలో ఉన్న 17 లక్షల 64 వేల 956 పోస్టుల్లో 19.51 శాతం, రాష్ట్రాల పరిధిలో 8.8 శాతం ఖాళీలు ఉన్నాయి. 2017-18 ప్రకారం సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉత్తరప్రదేశ్‌లో 90 శాతం పైగా ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఇంతటి తీవ్రమైన సమస్యపై... రానున్న రెండు దశాబ్దాలకు గాను... స్కూల్ కాంప్లెక్సుల వారీగా ఖాళీలను అంచనా వేసుకొని నియామకాలు చేయాలని...ఎన్‌ఇపి ఆచరణకు సాధ్యంకాని ప్రతిపాదన చేసింది.
నూతన జాతీయ విద్యా విధానాన్ని బిజెపి పాలిత రాష్ట్రాల కంటే శరవేగంగా అమలు చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. పూర్వ శిశు విద్య ప్రారంభించడం, నాలుగేళ్ళ డిగ్రీ, ఇంటర్న్‌షిప్ అమలు, రాష్ట్ర సిలబస్ రద్దు వంటి వాటి అమలుకు ఇప్పటికే పూనుకున్నారు. ఎన్‌ఇపి చెప్పిన బదిలీల రద్దును నేరుగా కాక బదిలీలు పరిమితంగా జరిగే విధంగా ఉపాధ్యాయులే బదిలీ వద్దునుకునే విధంగా నిర్వహించారు. ఎన్‌ఇపి ని పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మన రాష్ట్రంలో ఉపాధ్యాయుల ముందున్న అతి పెద్ద సవాలు నూతన జాతీయ విద్యా విధానం అమలు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ప్రభుత్వ రంగ పాఠశాలల్లో కోల్పోతారు. అందుకే నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడే, నిలువరించే శక్తిగల ఉద్యమ అభ్యర్ధులను రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలలోనూ బలపర్చాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- కె. శేషగిరి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.










