ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన నూతన విద్యా విధానంతో విద్యారంగంలో అనేక సమస్యలు తెరపైకి వచ్చాయని, విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీపురుపల్లి పావని అన్నారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో బుధవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన విద్యా విధానం పర్యవసానాలు, భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను వివరించారు. విద్యా రంగ సమస్యల పరిష్కరించుకోవడానికి విద్యార్థులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ నాగ రమణ, జిల్లా నాయకులు మామిడి రమణ, బాబ్జి, బాలాజీ, గీతాకృష్ణ, విద్యార్థినుల కన్వీనర్ పావని తదితరులు పాల్గొన్నారు.










