ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు ఉద్యోగులకు నూతన వేతనాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన విభాగం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు ప్రధానకార్యదర్శి యు.రామస్వామి పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెయిల్ కార్మికులతో సమానంగా ఉక్కు కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయడంలో విశాఖ స్టీల్ యాజమాన్యం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. 2017 నుంచి నూతన వేతనాలను అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాత్సారం చేస్తే కార్మికులను ఐక్యం చేసి ఉధృత పోరాటాలతో యాజమాన్యానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు వైటి.దాస్, గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్, శ్రీనివాసరాజు, నీలకంఠం, కెవి.సత్యనారాయణ కె.సత్యనారాయణ, వివిధ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.










