Feb 27,2023 20:36

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యుటీ డిఇఒ మహమ్మద్‌ బేగ్‌

నూతన పరిశోధనలతో ముందడుగు వేయాలి
- 'గురురాజా'లో ఘనంగా సైన్స్‌ ఎక్స్‌పో
ప్రజాశక్తి - నంద్యాల

      ప్రతి విద్యార్థి నూతన పరిశోధనలు సాధించేలా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పి దస్తగిరి రెడ్డి, శ్రీ రామకష్ణ డిగ్రీ పీజీ కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ గురురాజ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో డైరెక్టర్‌ పి.షేక్షావలి రెడ్డి అధ్వర్యంలో ఇంటర్‌ స్కూల్‌ సైన్స్‌ ఎక్స్‌పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్‌ బ్యాంకింగ్‌ కోచింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ జి.రామకృష్ణారెడ్డి, నంద్యాల డిప్యూటీ డిఇఓ మహమ్మద్‌ బేగ్‌, మండల విద్యాశాఖ అధికారి ఎస్‌.బ్రహ్మం, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలన్నారు. నేటి సమాజంలో మార్పులు సాధించాలంటే సైన్సు పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. నూతన పరిశోధనలు చేసేందుకు సైన్స్‌ ఎంతో అవసరమని చెప్పారు. పాఠశాలలు నిర్వహించిన సైన్స్‌ ఎక్స్‌పోలో విద్యార్థులు 230 పరిశోధనలు ప్రదర్శించారు. ప్రతి పరిశోధన అతిధులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో స్పోర్ట్స్‌ స్టాళ్లు ఏర్పాటు చేశారు. సునామీ, వరదలు సంభవించినప్పుడు ఇళ్లను సురక్షితంగా ఎలా కాపాడుకోవాలన్న అంశంపై పాఠశాల విద్యార్థిని సరయు రెడ్డి చేసిన ప్రదర్శన పలువురిని ఆలోచింపచేసింది. కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి.మౌలాలి రెడ్డి, పి షేక్షావలి రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అబ్బురపరిచిన స్నేక్‌ ఎకో సిస్టం : విద్యార్థులు ప్రదర్శించిన స్నేక్‌ ఇంపార్టెంట్‌ ఫర్‌ ఎకో సిస్టం ప్రయోగం అతిధులను ఆకట్టుకుంది. మానవ జీవన శైలిలో పాము సూచించే మంచి చెడులను విద్యార్థులు ప్రదర్శనగా చూపడంతో అతిధులు ఆనందం వ్యక్తం చేశారు.