Jun 12,2023 18:12

మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ పాఠశాలలో విద్యా కానుక కిట్ల పంపిణీలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సవం నుంచే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించి తరగతులు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒకే భవనంలో మహిళా జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఒక పూట తరగతులు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతారన్నారు. అరకొర వసతులతో సరైన ప్రయోగశాలు లేక డిగ్రీ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతారని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గౌస్‌, పవన్‌, శశి పాల్గొన్నారు.