ప్రజాశక్తి-వన్‌టౌన్: శాస్త్రీయ పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని, భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జాతీయ శాస్త్రీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వన్‌టౌన్‌లోని కెబిఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ డే ఉత్సవాలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ ప్రాధమిక దశ నుండే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆశక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివద్ధి చెందుతున్నాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో శాస్త్రజ్ఞుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. ఎంతో మంది గొప్ప శాస్త్ర వేత్తల ఆవిష్కరణల ద్వారా వైద్య ఆరోగ్య విజ్ఞాన రంగాలలో ఉత్తమ ఫలితాలను నేడు అనుభవించగలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెబిఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, అధ్యక్షులు టి.శేషయ్య, కార్యదర్శి టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.










