ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
నూతన అటవీ విధానం అమలు చేస్తే ఆదివాసీలకు తీరని నష్టం కలుగుతుందని, తక్షణమే ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం సంఘం ఆధ్వర్యాన కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అటవీ విధానం సర్క్యులర్‌ను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్ మాట్లాడుతూ
తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు పాలకుల విధానాలతో అడవులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ నూతన అటవీ విధానం తీసుకొచ్చిందని విమర్శించారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పట్టాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం స్పష్టంగా చెబుతుందన్నారు. నూతన అటవీ విధానంతో ఆదివాసీలు అడవుల నుంచే కాకుండా తమ సాంప్రదాయ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని విమర్శించారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రిజర్వాయర్ నిర్మాణం, ఖనిజ సంపద పేరుతో గిరిజనులను అడవుల నుంచి దూరం చేస్తున్నారన్నారు. పోడు పట్టాల్లేని భూములను వెనక్కి తీసుకోవాలని, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అటవీ హక్కు చట్టం వచ్చి నేటికీ 16 ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పోడు భూములను సాగు చేస్తున్న వారికీ పట్టాలివ్వడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దేశంలో 11 కోట్ల మంది గిరిజన తెగలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలు కాకుండా అడ్డంకులు కల్పిస్తుందన్నారు. 5, 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయపు భూములైన అడవుల నుండి గెంటి వేయబడుతున్నారన్నారు. ముఖ్యంగా పీసా, అటవీ హక్కుల చట్టం, న్యాయమైన పారదర్శక పరిహారం, పునరావాసం పొందే హక్కుల చట్టం (ఎల్‌ఎఎఆర్)లో పేర్కొన్న గిరిజన గ్రామసభ నిర్ణయం ఉల్లంఘించబడుతోందన్నారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జిల్లా నేతలు పోలోజు నాగేశ్వరరావు, చుండ్రు బుల్లెమ్మ, తెల్లం దుర్గారావు, కారం భాస్కర్, ఎస్.ఏసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, సిఐటియు జిల్లా నాయకులు ఆర్.లింగరాజు, మొడియం నాగమణి, ఎ.శ్యామలారాణి, ఎం.దుర్గారావు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం:ఆదివాసి ప్రతిఘటనా పోరాటాన్ని తక్కువ అంచనా వేయొద్దని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్ట సవరణను వ్యతిరేకిస్తూ చట్ట సవరణ ప్రతులను మంగళవారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తగరం బాబూరావు, గోవిందరాజు, అలివేరు సర్పంచి కారం అరుణ, కొర్సవారిగూడెం సర్పంచి గంగరాజు పాల్గొన్నారు.










