Jan 11,2023 21:00

డిపిఒ జివికె.మల్లికార్జునరావు
ప్రజాశక్తి - టి.నరసాపురం

                   మార్చి 31లోపు ప్రతి పంచాయతీలో నూరుశాతం పన్నుల వసూలుకు కార్యదర్శులు చర్యలు చేపట్టాలని డిపిఒ జివికె.మల్లికార్జునరావు సూచించారు. మండలంలోని తెడ్లెంలో పొంత దారిని కొందరు ఆక్రమించారని అందిన ఫిర్యాదు మేరకు ఆయన ఆ స్థలాన్ని బుధవారం పరిశించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పన్ను వసూళ్లలో వెనకబడి ఉన్నారని, ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే వసూలయ్యాయని చెప్పారు. నూరుశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. చెత్త సేకరణ ద్వారా పారిశుధ్యం మెరుగవుతుందన్నారు. వెలగపాడులో సచివాలయం, రైతుభరోసా కేంద్రం నిర్మాణాలకు గ్రామానికి చెందిన దాత 20 సెంట్లు ఇచ్చారని, ఆయనకు మరోచోట స్థలం ఏర్పాటు చేసి వాటి నిర్మాణాలు చేపట్టాలని ఎంపిడిఒను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్‌.తిరుపతి స్వామి, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.