Mar 15,2023 23:37

సమావేశంలో మాట్లాడుతున్న డిపిఒ శిరీషరాణి

ప్రజాశక్తి- కె.కోటపాడు
ఈ నెలాఖరు నాటికి జిల్లాలో నూరు శాతం ఇంటి పన్నుల వసూలు జరగాలని పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్‌ యార్డ్‌లను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలను ఏప్రిల్‌ 30వ తేదీలోగా అందంగా తయారు చేసేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కె.కోటపాడు మండలంలో 32 పంచాయతీలకుగాను 12 గ్రామాలను సుందర గ్రామాలుగా ఎంపిక చేశామని చెప్పారు. అనంతరం మేడిచర్ల, కె.కోటపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులను, మంచినీటి కోనేరు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఆమె వెంట ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.