ప్రజాశక్త - విజయవాడ రూరల్ : జిల్లాస్థాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ రూరల్ మండలం నున్న వచ్చిన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఢిల్లీరావు స్థానిక జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జడ్పీ హైస్కూల్‌లోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల ఆవరణలో రూ.1.68 కోట్లతో నాడు - నేడు పథకం కింద నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ వన్ అదనపు తరగతుల భవన సముదాయాన్ని పరిశీలిం చారు. అలాగే పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్‌కు వెళ్లి వారికి ఇంగ్లీష్ గ్రామర్‌ను బోధించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంగ్లీష్ టీచర్ సుభాషిణి బోధనా విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా విద్యార్థులతోనూ బ్లాక్ బోర్డుపై గ్రామర్ బోధన చేయించారు. అలాగే గ్రామర్‌కు సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇదిలావుండగా, మరో మూడు రోజులలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఎవరూ పరీక్షలకు భయపడవద్దని, ఒక ప్రణాళిక ప్రకారం చదివితే తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఎన్ ఎంఎంఎస్ పరీక్షా ఫలితాలలో నున్న హైస్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు జిల్లాస్థాయిలో తొలి మూడు ర్యాంక్లు సాధించినందుకు ఉపాద్యాయ బందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం భూపాల్‌రెడ్డితోపాటు స్టాఫ్ సెక్రటరీ కామినేని కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు కెవిఎస్ ఈశ్వరరావు, అరుణ, పాఠశాల డోనర్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










