నూనె గింజల పంట సాగుపై దృష్టి సారించాలి
ప్రజాశక్తి - బనగానపల్లె
నూనె గింజల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఐఐఒఆర్ సీనియర్ సైంటిస్ట్ అండ్ సీడ్ సెక్షన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె .జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని యాగంటి పల్లె కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం, భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌ఈ అండ్ సిఎస్ కార్యదర్శి పి. బాలాజీ అధ్యక్షతన ఆముదం పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జె.జవహర్ లాల్ మాట్లాడుతూ ఆముదం, కుసుమలు, ప్రొద్దుతిరుగుడు, తెల్ల కుసుమలు తదితర రకాల నూనె గింజల పంటలపై ఐఐఓఆర్ చేస్తున్న పరిశోధనల గురించి వివరించారు. ప్లాంట్ బ్రిడర్ క్యాస్టర్ డాక్టర్ లావణ్య మాట్లాడుతూ ఆముదం పంట విత్తన ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆముదం సాధారణంగా పండిచడం కంటే విత్తనోత్పత్తి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు సంఘాలుగా ఏర్పడి విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. అధిక దిగుబడుల సాధనకు చేయాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. పంటల ఉత్పత్తిపై పోషక లోపాల ప్రభావం, భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. రసాయన, ఇతర క్రిమిసంహార మందుల వాడకం తగ్గించి, నేరుగా పురుగు లేదా తెగులుకు సంబందించిన ఒక రకమైన మందునే పిచికారీ చేసి ఖర్చు తగ్గించుకోవాలని తెలిపారు. ఎండు తెగులు, వేరుకుళ్ళు , పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు నివారణపై సస్య రక్షణ చర్యలు సూచించారు. కొత్త వంగడాలను వినియోగించి అధిక దిగుబడులు పొందాలని తెలియచేసారు. కార్యక్రమంలో అగ్రోనామిస్ట్ డాక్టర్ సురేష్, ప్లాంట్ బ్రీడర్ అండ్ సీనియర్ సైంటిస్ట్ మంజునాథ్, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌డి ప్రసాద్, కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ధనలక్ష్మి, శాస్త్రవేత్త సుధాకర్, ఎస్‌హెచ్‌ఈ అండ్ సిఎస్ ఏవో సురేష్ కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, రమణయ్య, బాలరాజు, ఆదినారాయణ, రవిగౌడ్, లక్ష్మి ప్రియా, రైతులు పాల్గొన్నారు.










