ప్రజాశక్తి - చాట్రాయి
ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు బాలబాలికలలో నులుపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు సురక్షితమైనవని పిహెచ్‌సి వైద్యాధికారులు డా.కె.విజయలక్ష్మి, డా.ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీన జాతీయ నులుపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా 10వ తేదీన ఈ మాత్రలను అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలలో పిల్లలకు మింగించడం జరుగుతుందని చాట్రాయి వారు తెలిపారు. రక్తహీనతకు, పోషకాహార లోపానికి ఈ నులుపురుగులు కారణమన్నారు. స్థానిక చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపిడిఒ దుర్గాప్రసాద్, ఎంఇఒ బ్రహ్మాచారి, వైద్యాధికారుల సమక్షంలో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ, పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడిఒ కె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ మాత్రలు అందేటట్టుగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని కోరారు. ఎంఇఒ మాట్లాడుతూ 10వ తేదీన 100 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు హాజరు అయ్యేటట్లు, పిల్లలందరూ మాత్రలు మింగేటట్లుగా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జివి రమణ, సూపర్‌వైజర్ ప్రభాకర్ రావు, ఎఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.










