Aug 05,2023 00:12

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాసు, ఐటిడిఏ.పి ఓ అభిషేక్‌

ప్రజాశక్తి-పాడేరు: ఈనెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యాక్రమాలు పక్కాగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ.పి ఓ వి. అభిషేక్‌ స్పష్టం చేసారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై రూపొందించిన కరపత్రాలు, గోడ పత్రికలను శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, నులి పురుగుల నిర్మూలనపై ప్రజలను చైతన్యవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నులిపరుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడతారని చెప్పారు. 1 నుండి 5 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలోను, 6 నుండి 19 ఏళ్ల పిల్లలకు కిషోర బాలికలకు పాఠశాలలు, కళాశాలలో నులిపురుగుల నివారణ బిళ్లలు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పి.అంబేద్కర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వి.వి.ఎస్‌. శర్మ, ఐసిడి ఎస్‌పిడి సూర్యలక్ష్మి, ఐటిడిఏ పరిపాలనాధికారి హేమలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.