ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లావ్యాప్తంగా 2 నుంచి 19 ఏళ్ల లోపు వారు నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తప్పక వేసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో అరసవల్లిలోని కోరాడవీధిలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మాత్రలువేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్బెండాజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల ఏవిధమైన ఇబ్బందులు ఉండవన్నారు. ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తన పిల్లలకు ఈ మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. పాఠశాలకు రాని విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 4,44,162 మంది పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వారందరికీ మాత్రలు వేయించాలన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు. కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ముందుగా మాత్రలు వేసుకుని, అనంతరం విద్యార్థులకు వేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, శ్రీదేవి, డిపిఎంఒ లింగరాజు, సాయిదివ్య, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇ.విమల కుమారి, ఆర్‌బిఎస్‌కె మేనేజర్ అప్పలనాయుడు, ఎఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు










