Mar 14,2023 23:55
వేటపాలెం సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి-వేటపాలెం: జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కళాశాల లోని జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో 19 సంవత్సరాలలోపు వయసున్న విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ మొయిద వేణు గోపాలరావు తెలిపారు. పందిళ్లపల్లి ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, జె సుధాకర్‌ సహకారం తో 800 మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జాతీయ సేవా విభాగం ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ డి జ్యోతి స్వరూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి తిరుమలరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.
చీరాల: పిల్లల్లో నులిపురుగులను నివారించి వ్యాధినిరోధక శక్తి పెరుగుదలకు ఆల్బెండజోల్‌ మాత్రలు దోహదపడతా యని కమిషనర్‌ ఏసయ్య పేర్కొన్నారు. జాతీయ నులిపురు గుల నివారణ దినోత్సవంలో భాగంగా మంగళవారం పేరాల ఏఆర్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్‌ ఏసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌తోపాటు వైద్యులు జాకోబ్‌ జ్యోతిరావు, శిరీష, రవికుమార్‌ మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులు ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా రోగాల బారిన పడటం తగ్గుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సాల్మన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బల్లికురవ రూరల్‌: జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని 10,114 మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసినట్లు మండల వైద్యాధికారి రమీజు అహ్మద్‌ తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని పాఠశాలలో స్కూల్‌ హెచ్‌ఎం, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు మధ్యాహ్నం భోజనం చేశాక విద్యార్థులతో ఈ మాత్రలు మింగించారు. సూపర్వైజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ప్రేమలీల, కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
అద్దంకి: కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంగళవారం ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వి మోహన్‌రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా 98 మంది విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేశారు. ఏఎన్‌ఎం ఎస్‌ నాగేశ్వరమ్మ, ఆశా కార్యకర్త వి రత్నమాల, కళాశాల జాతీయ సేవా పథకం 1, 2 విభాగాల బాధ్యులు డాక్టర్‌ కె ప్రభుదాసు, డాక్టర్‌ చిలుకు అనిత ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.