Mar 09,2023 23:38

మాట్లాడుతున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ సుజాత

ప్రజాశక్తి-అనకాపల్లి
ఈనెల 20 నుంచి ఏప్రిల్‌ నెల 19వ తేదీ వరకు కొత్త అమావాస్య సందర్భంగా శ్రీనూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత తెలిపారు. స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ వద్ద గురువారం వైసిపి యువజన నాయకులు, జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షులు దాడి జయ వీర్‌ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలరోజులపాటు జరిగే ఈ జాతరలో పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. జయవీర్‌ మాట్లాడుతూ ఆలయ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన తాగునీటిని సరఫరా చేయాలని, వీధి దీపాల మరమ్మతు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులను కోరారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణ షాపులను తొలగించాలని, అగ్ని ప్రమాదాలు జరగక్కుండా మాక్‌ డ్రిల్‌ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యశాఖ నెలరోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరం ఆలయ వద్ద ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చూడాలని కోరారు. దూరదర్శన్‌, ఆకాశవాణి ద్వారా జాతర కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో మద్యపానం అమ్మకుండా చూడాలని, స్పెషల్‌ స్క్వాడ్‌తో గస్తీ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్‌, డిఎస్‌పి మహేశ్వరరావు, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ బుద్ధ లక్ష్మి నగేష్‌, జీవీఎంసీ ఈఈ చిరంజీవి, ఏఈ సుమిత్ర, ఎన్టీఆర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌, ట్రాఫిక్‌ సిఐ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.