
ప్రజాశక్తి-అనకాపల్లి : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి గురువారం శారదా పీఠాధిపతి స్వామి స్వరూపా నందేంద్ర, రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ముందుగా వారికి ఆలయ మర్యాదలతో వైసిపి నాయకులు దాడి జయవీర్, దాడి రత్నాకర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో యాగశాల నిర్మించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వాస్తు హోమాన్ని నిర్వహించారు. శంఖు శిలలు స్వామీజీ అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం తరుపున స్వామిని, మంత్రి అమర్నాథ్‌ని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. మొదటి దశలో మూడున్నర కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు ఆలయ పర్యవేక్షకులు దాడి జయవీర్ తెలిపారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కర్, పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, ఆలయ కార్యనిర్వాహణాధికారి బండారి ప్రసాద్, ఉపసపది శ్రీనివాసాచార్యులు, జిల్లా ఏసీ ఎస్.రాజారావు, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.