May 31,2023 21:37

ప్రజాశక్తి - ముసునూరు
          మధుర మామిడి ఫలాలకు ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని పండ్ల తోటల విస్తీర్ణంలో 60 శాతానికి పైగా మామిడి తోటలే విస్తరించి ఉన్నాయి. ఏటేటా రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. అందులో కృష్ణాజిల్లాదే అగ్రభాగం. జిల్లాలో నూజివీడు నుంచి 55 శాతం మామిడి దిగుబడి అవుతుందంటే ఎంత మేర విస్తరించి ఉందో అర్థమవుతోంది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మామిడి తోటలు విస్తరించినప్పటికీ నూజివీడు డివిజన్‌ ప్రాంతంలో పండే చిన్న, పెద్దరసాలతో పాటు హిమాయతీలకు జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. ప్రధానంగా జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఒక్క నూజివీడు ప్రాంతంలోనే 85 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసాంతం వరకూ మామిడి పంట అందుబాటులో ఉంటుంది. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి ఇతర జాతులు ఎక్కువుగా లభిస్తుంటాయి. చాట్రాయి, విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, మైలవరం తదితర మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మామిడికాయలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేశాయి. ఎండలు బాగా ముదిరిపోవటంతో ఇక తోటల్లో కాయలు నిలిచే అవకాశం లేకుండా పోయింది. చెట్లపైనే కాయలు పండుతున్నాయి. రసాల పండ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. రైతు వద్ద పచ్చి మామిడి రూ.5 నుంచి రూ.10 వరకూ ధర పలుకుతోంది. వీటిని వ్యాపారులు కొనుగోలు చేసి మార్కెట్లో వివిధ సైజులను బట్టి డజను రూ.400 నుంచి రూ.500 ధరలకు విక్రయిస్తున్నారు. ఇక తీపి మామిడి కాయ రైతు వద్ద రూ.15 ఉండగా మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.100కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. బంగినపల్లి పండ్లు కూడా మార్కెట్‌లోకి పెద్దఎత్తున వచ్చేశాయి. అవి కూడా వినియోగదారులకు అందుబాటులో లేని ధరల్లో ఉన్నాయి. డజను రూ.400 నుంచి రూ.450 వరకూ విక్రయిస్తున్నారు. ఇక పచ్చడి మామిడికి యమ గిరాకీ ఉంది. రైతు వద్ద రూ.5 కూడా పలకని మామిడి మార్కెట్లో మాత్రం రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారు. కొందరు తోతాపురి మామిడిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తాత్కాలికంగా పచ్చళ్లు పట్టుకుంటున్నారు.
మధుర ఫల రాజం 'మామిడి'
అదో అమృత భాండం. ఎన్నో దివ్య ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఏటేటా వేసవిలో లభించే మామిడి కాయలు, పండ్లు తింటే ఎంతో మధురంగా ఉంటాయి. వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి మామిడి కాపాడుతుంది. జీర్ణ శక్తి మెరుగవుతుంది. ఆరోగ్యానికి దోహదపడే గుణాలెన్నో మామిడిలో ఉన్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత కృష్ణాజిల్లాలోనే మామిడి తోటలు అత్యధికంగా సాగవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. నూజివీడు పేరు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి మామిడి కారణంగా చెప్పక తప్పదు. నూజివీడు మెట్ట ప్రాంతంలో 60 శాతం మంది రైతులు మామిడి పంటను ప్రధాన సాగుగా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఏటేటా 30 నుంచి 40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. అందులో కృష్ణాజిల్లాదే అగ్రభాగం. జిల్లాలో నూజివీడు నుంచి 60 శాతం మామిడి దిగుబడి అవుతుందంటే ఎంత మేర విస్తరించి ఉందో అర్థమవుతుంది. ఒక్క నూజివీడు డివిజన్‌లోనే 85 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండే చిన్న, పెద్ద రసాలతో పాటు హిమాయతీలకు జాతీయ అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి ఇతర జాతులు ఎక్కువగా లభిస్తున్నాయి. నూజివీడు డివిజన్‌లో చాట్రాయి, విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, మైలవరం తదితర మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది మామిడి తోటలు పూత తక్కువగా వచ్చాయి. తోటల్లో సగానికి సగం చెట్టు మాత్రమే కాపు కాశాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మామిడికోతలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. మార్కెట్లోకి పెద్దఎత్తున మామిడి పండ్ల విక్రయాలు జరుగుతున్నాయి. నోరూరించే మామిడిపండ్లు తినని వారు ఉండరంటే ఆశ్చర్యం కలుగకమానదు.
ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్నో
మామిడిలో సాచ్యురేటెడ్‌ కొవ్వు, కొలెస్ట్రాల్‌, సోడియం తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార పైబర్‌, విటమిన్‌ బి.6, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి వంటి అద్భుతమైన వనరులున్నాయి. పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. మామిడిలో కెర్చెతిన్‌, బీటాకెరోటిన్‌, అస్త్రగాలిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్‌ను తటస్థీకరించటానికి ఉపయోగపడుతున్నాయి. గుండె వ్యాధి, అకాల వృద్ధాప్యం, కేన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వంటి సమస్యలతో కణాల నాశనం ఈ ప్రీరాడికల్స్‌ కారణంగా ఉంటుంది. ఈ మ్యాజికల్‌ మామిడికాయతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మామిడికాయలో అల్టిమేట్‌ విటమిన్‌ కంటెంట్‌ కలిగివుండటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీనిలో పొటాషియం (156 ఎంజి-4 శాతం), మెగ్నీషియం (9 ఎంజి-2 శాతం) సమృద్ధిగా ఉండటం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. కేన్సర్‌ ప్రమాదాలు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గిస్తుంది. మామిడి అజీర్ణం ఆమ్లత వంటి సమస్యలను తొలగించటంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మామిడిలో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ ఉంటాయి. మామిడి కాయ రక్తహీనతతో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిలో ఎ, సి విటమిన్లు శరీరంలో అధిక మొత్తంలో కొల్లాజెన్‌ ప్రొటోన్‌ ఉత్పత్తి చేయటానికి సహాయం చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది,
మధుర ఫలం.. పండంతా దివ్య ఔషధాల గని
మామిడి గురించి ఎంత చెప్పినా అది తక్కువే! పక్వానికి రాని మామిడి కాయలను ముక్కలుగా తరిగి తినొచ్చు. అయితే వీటిని తిన్న వెంటనే చన్నీళ్లు తాగకూడదు. ఇలాచేస్తే పచ్చిమామిడికాయలో ఉండే బంక వంటి పదార్థం గట్టిపడి గొంతులోని శ్లష్మవు పొరలను ఇరిటేట్‌ చేస్తుంది. పెరిగే పిల్లలకు మామిడి రసంలో ఉండే పోషక పదార్థాలు, పాలలో ఉండే మాంసకృత్తులు కలిసి సంపూర్ణాహారంగా పనిచేస్తాయి. మామిడి రసం వల్ల విరోచనాలవుతాయనుకవడం అపోహ మాత్రమే. మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతమందికి సెగ గడ్డలు వస్తుంటాయి. శరీరంలో దాగున్న వేడిని బయటకు తెచ్చే గుణం మామిడికి ఉందనడానికి ఇలా జరుగుతుంది. వేడి శరీర తత్వం ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా తినడం మంచిది.