Jul 12,2023 22:48

ప్రజాశక్తి-కాకినాడ ప్రాతినిధి కాకినాడ జిల్లాలో రెండో విడత నాడు-నేడు పనుల్లో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఏడాదికాలంగా నత్తనడకన సాగుతున్నాయి. సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడం ఒక సమస్య అయితే, సిమెంటు, ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. గత నెల 12 నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్న నేపథ్యంలో ఇసుక, ఇనుము, కంకర తదితర మెటీరియల్‌ స్కూలు కాంపౌండ్‌లో అడ్డుగా ఉండడంతో పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల పనులు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల మందుకొడిగా సాగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల 90 శాతం పూర్తయ్యాయి. ఇలా నాడు-నేడు పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
పనులు పూర్తయ్యేదెప్పటికో...
కాకినాడ జిల్లాలో 882 పాఠశాలల్లో నాడు-నేడులో అదనపు తరగతి గదులు నిర్మాణంలో భాగంగా 5,142 పనులు మంజూరయ్యాయి. రూ.335.55 కోట్లు అంచనా విలువతో నిధులు కేటాయించగా ఇప్పటి వరకూ రూ.107.19 కోట్లు నిధులను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా రూ.228.36 కోట్లు డుదల కావాల్సి ఉంది. గతేడాది ఆగస్టులో నాడు-నేడు పనులు అన్ని పాఠశాలల్లో మొదలయ్యాయి. అయితే సకాలంలో గ్రాంట్‌ విడుదల కాకపోవడంతో పలుచోట్ల పనులు తొలుత మొదలు కాలేదు. ఆ తర్వాత మొదలైనా వివిధ కారణాలతో నత్తనడకనే జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 12న స్కూల్‌ తెరిచే నాటికే పనులు నూరు శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ దాదాపు ఏడాది కావస్తున్నా 50 శాతం పనులు కూడా ఎక్కడ పూర్తికాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎందుకు కారణంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిఠాపురం పాత బస్టాండ్‌ మున్సిపల్‌ హైస్కూల్లో రూ.72 లక్షల నిధులతో 6 అదనపు తరగతి గదులు మంజూర య్యాయి. రెండంతస్తులు భవనానికి స్లాబులు పూర్తయినా తలుపులు, కిటికీలు, ప్లాస్టింగులు ఇటువంటి పనులేమీ జరగలేదు. ఇప్పటివరకు 70 శాతం మాత్రమే పనులు పూర్తవ్వగా నూరు శాతం పూర్తి కావాలంటే మరో 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఏలేశ్వరం బాలికల హైస్కూల్లో 670 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రూ.1.20 కోట్లతో 10 తరగతి గదులు మంజూరు కాగా 70 శాతం పనులే పూర్తయ్యాయి. కిర్లంపూడి మండలం తామరాడ జెడ్‌పి హైస్కూల్లో 6 తరగతి గదులకు 70 శాతం పనులే అయ్యాయి. గెద్దనాపల్లి జెడ్‌పి హైస్కూల్లో 11 తరగతి గదులకు రూ.1.32 కోట్లకుగానూ ఇప్పటి వరకు రూ.48 లక్షలు మాత్రమే గ్రాంటు విడుదల అయింది. సిమెంటు, ఇసుక కొరతతో పనుల్లో జాప్యం చోటుచేసుకున్నట్లు తల్లిదండ్రుల కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే ఇక్కడ పూర్తయ్యాయి. లింగంపర్తి జెడ్‌పి హైస్కూల్లో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10 అదనపు తరగతి గదులకు రూ.కోటీ 20 లక్షలు మంజూరు కాగా 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ప్రత్తిపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్‌పి హైస్కూల్లో సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 3 అదనపు తరగతి గదుల పనులు ప్రారంభమై ఇప్పటివరకు 60 శాతమే పూర్తయ్యాయి.